Chyawanprash | చిన్నతనంలో చాలా మంది చ్యవన్‌ప్రాశ్ లేహ్యాన్ని తినే ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది దీన్ని తినడం లేదు కానీ ఇమ్యూనిటీని పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మార్కెట్లో మనకు పలు రకాల కంపెనీలకు చెందిన చ్యవన్ ప్రాశ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్లో ఉన్న చ్యవన్ ప్రాశ్లు వద్దనుకుంటే మీరు ఇంట్లోనే సులభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో అనేక రకాల ఆయుర్వేద మూలికలు కలుస్తాయి. దీన్ని రోజూ తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు అనేక లాభాలు కలుగుతాయి. ఇక చ్యవన్ ప్రాశ్ లేహ్యాన్ని ఎలా తయారు చేయాలి, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక రకల ఆయుర్వేద మూలికలను వేసి తయారు చేసే చ్యవన్ ప్రాశ్ అనేక బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. చ్యవన్ అంటే ఒక ముని పేరు. ప్రాశ్ అంటే ప్రత్యేకమైన ఆహారం అని అర్థం. చ్యవన్ అనే ముని దీన్ని తయారు చేసినందున దీనికి చ్యవన్ ప్రాశ్ అనే పేరు వచ్చింది. చ్యవన్ ప్రాశ్ను చలికాలంలో కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చ్యవన్ ప్రాశ్ను ఎవరైనా సరే తినవచ్చు. చ్యవన్ ప్రాశ్ ప్రధాన ఉద్దేశం రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడమే. దీంతో శరీర సహజసిద్ధమైన శక్తి ఉత్తేజితం అవుతుంది. శరీరం ఎర్ర రక్త, తెల్ల రక్త కణాలను మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. అలాగే చ్యవన్ ప్రాశ్ను తినడం వల్ల గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం పోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కనుక చలికాలంలో చ్యవన్ ప్రాశ్ను తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది.
చ్యవన్ ప్రాశ్ లేహ్యం తయారీకి గాను కంపెనీలు పొటాషియం సార్బేట్ను ఉపయోగిస్తాయి. ఇది ఒక ప్రిజర్వేటివ్. కానీ మనం ఇంట్లో తయారు చేసే చ్యవన్‌ప్రాశ్‌కు ఇది అవసరం లేదు. మనకు కావల్సినప్పుడు చ్యవన్ ప్రాశ్ను తయారు చేసుకుని వాడవచ్చు. చ్యవన్ ప్రాశ్ తయారీకి గాను తురమిన బెల్లం వాడాల్సి ఉంటుంది. అలాగే తేనె, ఇతర ఆయుర్వేద మూలికలు కూడా ఇందుకు అవసరం అవుతాయి. చ్యవన్ ప్రాశ్ను తయారు చేసేందుకు ఉసిరికాయలు 750 గ్రాములు, చక్కెర 750 గ్రాములు, తేనె 85 గ్రాములు, వెన్న పావు కిలో, నువ్వుల నూనె 75 ఎంఎల్, యాలకులు 25 గ్రాములు, త్రిఫల చూర్ణం 12 గ్రాములు, గుడుచి సత్వ 12 గ్రాములు, వంశలోచన్ 12 గ్రాములు, చందనం 10 గ్రాములు, పిప్పళ్లు 10 గ్రాములు, అల్లం (పొడి) 10 గ్రాములు, దశమూలం 5 గ్రాములు, బిర్యానీ ఆకులు 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, లవంగాలు 5 గ్రాములు, చైనీస్ దాల్చిన చెక్క 5 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు, ప్రవాల భస్మం 2.5 గ్రాములు, మృగశృగ భస్మం 2.5 గ్రాములు, నాగకేసరం 2.5 గ్రాములు కావల్సి ఉంటుంది.
అన్ని పదార్థాలకు చెందిన పొడులను కలిపి ఒక గాజు పాత్రలో వేసి పక్కన పెట్టాలి. ఉసిరికాయలను బాగా కడిగి పొడిగా అయ్యే వరకు ఉంచాలి. ఉసిరికాయల్లోంచి గింజలను తీసేయాలి. ఉసిరికాయలను కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వాటిని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టాలి. అనంతరం నాన్‌స్టిక్ పాన్ తీసుకుని అందులో వెన్న, నూనె, చక్కెర వేయాలి. అందులో ముందు సిద్ధం చేసుకున్న ఉసిరికాయ పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్‌ను చిన్న మంటపై పెట్టి ఉడికించాలి. దీంతో అందులో ఉన్న తేమ అంతా బయటకు పోతుంది. తరువాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొడులను వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం బాగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. అనంతరం ఆర్గానిక్ తేనె వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పొడిగా ఉండే గ్లాస్ బాటిల్లోకి తీసుకోవాలి. దీంతో చ్యవన్ ప్రాశ్ రెడీ అయినట్లే. దీన్ని మీరు కావల్సినప్పుడు తినవచ్చు. పెద్దలు దీన్ని రోజుకు ఒక టీస్పూన్ తినవచ్చు. పిల్లలకు అర టీస్పూన్ నుంచి పావు టీస్పూన్ సరిపోతుంది. ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. ఇక చ్యవన్ ప్రాశ్ను తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది కనుక దీన్ని కేవలం చలికాలంలోనే తినాలి. ఎండాకాలంలో తినకూడదు. ఇలా ఇంట్లోనే మీరు చ్యవన్ ప్రాశ్ను తయారు చేసి వాడవచ్చు.