Amla Juice | ఉసిరికాయలు.. వీటినే హిందీలో ఆమ్లా అని.. ఇంగ్లిష్‌లో గూస్బెర్రీ అని పిలుస్తారు. వీటిని పోషకాలకు గనిగా చెబుతారు. ఆయుర్వేదంలో ఎంతో పురాతన కాలం నుంచి ఉసిరికాయలను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం చెప్పిన త్రిఫలాల్లో ఉసిరికాయలు కూడా ఒకటి. దీంతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. ఈ సీజన్లో మనకు ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. ఉసిరికాయల్లో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఉసిరికాయలను తింటే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఉసిరికాయలను ఏ విధంగా అయినా సరే తీసుకోవచ్చు. దీన్ని జ్యూస్‌లా చేసి చాలా మంది తీసుకుంటారు. ఉసిరికాయ జ్యూస్ అయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని ఎప్పుడైనా సరే తెచ్చి తాగవచ్చు.
ఉసిరికాయ జ్యూస్‌ను తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకనే ఈ జ్యూస్‌ను సూపర్‌ఫుడ్‌గా కూడా చెబుతారు. ఉసిరికాయ జ్యూస్‌ను తాగితే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. వయస్సు మీద పడిన లక్షణాలు కనిపించవు. ఉసిరికాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. యవ్వనంగా కనిపిస్తారు. కాబట్టి యవ్వనంగా కనిపించాలంటే ఉసిరికాయ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా బయట పడవచ్చు.
ఉసిరికాయ జ్యూస్ మనకు సహజసిద్ధంగా శక్తిని అందిస్తుంది. దీన్ని తాగితే శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె పనితీరు మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. అనేక పోషకాలు కూడా లభిస్తాయి. ఉసిరికాయ జ్యూస్‌ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు గాను తాజా ఉసిరికాయలను అరకిలో తీసుకోవాలి. నీళ్లు 2 కప్పులు, తేనె లేదా చక్కెర (అవసరం అనుకుంటేనే) 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, నల్ల ఉప్పు చిటికెడు తీసుకోవాలి.
ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి దుమ్ము, ధూళి, మట్టి లేకుండా శుభ్రం చేసి బాగా ఆరబెట్టాలి. తరువాత విత్తనాలను తీసేసి కాయలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తరువాత ఉసిరికాయ ముక్కలను బ్లెండర్లో వేసి అందులో ఒక కప్పు నీళ్లను పోసి మెత్తని పేస్ట్‌లా బ్లెండ్ చేయాలి. తరువాత ఒక శుభ్రమైన వస్త్రంలో పోసి వడకట్టాలి. వస్త్రాన్ని బాగా పిండుతూ జ్యూస్ తీయాలి. అందులో మిగిలిన కప్పు నీళ్లను పోసి బాగా కలపాలి. దీంతో రుచి బాగా స్ట్రాంగ్‌గా ఉండకుండా ఉంటుంది. ఇలా తయారు చేసిన జ్యూస్‌లో కావాలనుకుంటే కాస్త నల్ల ఉప్పు, తేనె లేదా చక్కెర కలిపి తాగవచ్చు. ఇలా తయారు చేసిన జ్యూస్‌ను మీరు రోజులో ఎప్పుడైనా సేవించవచ్చు. కానీ ఆయుర్వేద చెబుతున్న ప్రకారం ఉసిరికాయ జ్యూస్‌ను ఉదయం పరగడుపునే తాగితే మంచిది. దీంతో శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రోజంతా మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఇలా ఉసిరికాయల జ్యూస్‌ను తాగడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు.