Intermittent Fasting | ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఆయుర్వేదంలో కూడా ఉపవాసం గురించి ఎంతగానో వివరించారు. ఉపవాసం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాక ఆరోగ్యపరంగా కూడా అనేక లాభాలను అందిస్తుంది. చాలా మంది ఆధ్యాత్మిక పరంగా వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం ఉంటుంటారు. కొందరు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆహారం అసలు తీసుకోకుండా లేదా చాలా స్వల్పంగా తీసుకుని ఉపవాసం చేస్తారు. దీని వల్ల శరీరం మరమ్మత్తులకు గురవుతుంది. మృత కణాలు తొలగిపోతాయి. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. వ్యాధి త్వరగా నయం అవుతుంది. కనుకనే అప్పుడప్పుడు ఉపవాసం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే మాట తరచూ వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..? దీన్ని ఎలా పాటించాలి..? దీంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో కొన్ని గంటలపాటు అసలు ఆహారం ఏమీ తీసుకోకూడదు. కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే రోజులో ఉన్న 24 గంటల్లో కనీసం 16 నుంచి 20 గంటల పాటు ఉపవాసం ఉండాలి. మీకు నచ్చిన సమయంలో ఇలా ఉపవాసం ఉండవచ్చు. మిగిలిన 4 నుంచి 8 గంటల వ్యవధిలో మీకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. టైమ్ దాటిందంటే మళ్లీ ఉపవాసం పాటించాలి. ఇలా రోజులో కేవలం ఒక నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవడం, మిగిలిన సమయంలో ఆహారాన్ని తీసుకోకపోవడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీన్ని ప్రస్తుతం చాలా మంది పాటిస్తున్నారు. విదేశాల్లో ప్రస్తుతం ఈ తరహా ఉపవాసానికి అధికంగా ప్రాధాన్యతను అందిస్తున్నారు. చాలా మంది వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా ఈ తరహా ఉపవాసాన్ని పాటించాలని సూచిస్తున్నారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ను పాటించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీని వల్ల శరీరానికి చాలా సేపు విరామం లభిస్తుంది. ఆ సమయంలో శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. చనిపోయిన కణాలను బయటకు పంపిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అంతర్గతంగా క్లీన్ అయ్యేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అధికంగా బరువు ఉన్నవారు ఈ తరహా ఫాస్టింగ్ను పాటిస్తుంటే బరువు త్వరగా తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
గ్యాస్, అసిడిటీ, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ను పాటిస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఈ ఫాస్టింగ్ ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్లో ఉండే కొవ్వు కరుగుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నాడీ మండల వ్యవస్థ సైతం చురుగ్గా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్గా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే డాక్టర్ లేదా డైటిషియన్ సూచన మేరకు ఈ ఉపవాసం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కాకుండా సులభంగా ఈ ఫాస్టింగ్ ను పాటించవచ్చు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.