Mosquitoes | దోమలు మనుషులను ఎలా గుర్తించి కుడతాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఇప్పటివరకు దోమలు ఒకదానిని ఒకటి అనుసరిస్తాయని అనుకునే వారు, కానీ ఈ పరిశోధన ఆ భావనను పూర్తిగా మార్చేసింది. అసలు విషయానికి వస్తే, దోమలు నాయకుడిని అనుసరించవని, పర్యావరణ సంకేతాలను అనుసరిస్తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అమెరికాలోని జార్జియా టెక్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి చెందిన పరిశోధకులు అధిక సంఖ్యలో దోమలను పరిశీలించి, సుమారు 20 మిలియన్ల డేటా పాయింట్లను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో ముఖ్యంగా ఆడ ఏడిస్ ఈజిప్టై (Aedes aegypti) దోమల ప్రవర్తనను పరిశీలించారు. ఈ దోమలే సాధారణంగా యెల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
పరిశోధకులు 3డీ ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగించి, దోమలు మనుషుల చుట్టూ ఎలా కదులుతాయో గమనించారు. ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ వాసన, విజువల్ సంకేతాలు (రంగులు, ఆకారాలు) దోమలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తించారు. ఒక మనిషిని కంట్రోల్డ్ ఛాంబర్లో ఉంచి, అతని దుస్తుల రంగులను మార్చుతూ పరీక్షలు నిర్వహించారు. ఈ పరిశోధనలో కీలకమైన విషయం ఏమిటంటే ప్రతి దోమ స్వతంత్రంగా స్పందించింది. అవి గుంపుగా కనిపించినా, ఒకదానిని ఒకటి అనుసరించడం వల్ల కాదు. ఒకే రకమైన సంకేతాలకు ఆకర్షితమై, అవన్నీ ఒకే ప్రదేశానికి చేరుకుంటాయి. అంటే, అవి ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఉండటం యాదృచ్ఛికం కాదు, కానీ ఒకే కారణం వల్ల జరుగుతుంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఒక ఉదాహరణతో వివరించారు. బిజీగా ఉన్న బార్లో ఉన్నవాళ్లు ఒకరిని ఒకరు అనుసరించి రారు. అక్కడ ఉన్న సంగీతం, వాతావరణం, పానీయాలు వారిని ఆకర్షిస్తాయి. అదే విధంగా దోమలు కూడా సంకేతాలను అనుసరిస్తాయి.. అని చెప్పారు.
ఈ అధ్యయనం ద్వారా దోమలు ఎలా నిర్ణయం తీసుకుంటాయో అర్థం చేసుకోవడానికి గణిత మోడల్ కూడా రూపొందించారు. భవిష్యత్తులో ఇది మెరుగైన పెస్ట్ కంట్రోల్ పద్ధతులను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మలేరియా, జికా, యెల్లో ఫీవర్ వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాపింపజేసే దోమలను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ దోమలపై నియంత్రణ సాధించేందుకు ఈ పరిశోధన కీలక అడుగుగా మారుతుందని అంచనా వేస్తున్నారు.