Tomatoes | టమాటాలను మనం మన రోజువారి ఆహారంలో భాగంగా వాడుతూనే ఉంటాం. టమాటాలను పలు రకాల కూరల్లో వేస్తుంటారు. ఇతర కూరగాయలతో కలిపి వండుతారు. టమాటాలను అన్ని రకాలుగా వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటారు. వృక్షశాస్త్రం ప్రకారం చెప్పాలంటే వాస్తవానికి టమాటా ఒక కూరగాయ కాదు, పండు. కానీ దీన్ని కూరగాయ గానే ఉపయోగిస్తున్నారు. టమాటాల్లో అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీని వల్లే టమాటాలు చూడచక్కని ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్ వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గుతుంది. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది.
లైకోపీన్ వల్ల పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. లైకోపీన్తోపాటు టమాటాల్లో పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవన్నీ కలసి గుండె ఆరోగ్యం కోసం పనిచేస్తాయి. పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. లైకోపీన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లతో కలిసి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాల్లో విటమిన్లు సి, కె అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. టమాటాల్లో ఉండే విటమిన్ కె ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయినప్పుడు తీవ్ర రక్త స్రావం జరగకుండా రక్షిస్తుంది. రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది.
టమాటాల్లో ఉండే లైకోపీన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షిస్తాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సూర్యకాంతిలోనూ చర్మం కందిపోకుండా చూసుకోవచ్చు. ఇక టమాటాలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలుసు. కానీ వీటిని రోజుకు ఎంత మోతాదులో తినాలి అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. టమాటాల్లో లైకోపీన్ అధికంగా ఉంటుందని, ఇది మనకు ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే లైకోపీన్ మనకు అధిక మోతాదులో లభించాలంటే టమాటాలను ఎల్లప్పుడూ ఉడికించే తినాలి. పచ్చిగా ఉండే టమాటాల్లో లైకోపీన్ తక్కువగా ఉంటుంది. కనుక లైకోపీన్ ఎక్కువగా కావాలనుకునే వారు టమాటాలను ఉడకబెట్టి తింటే మంచిది.
టమాటాల్లో ఉండే లైకోపీన్ ఎక్కువగా కొవ్వుల్లో కరుగుతుంది. కనుక టమాటాలను ఎప్పుడు తిన్నా కొవ్వు పదార్థాలతో తింటే మేలు జరుగుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, చేపలు, నెయ్యి, గింజలు, విత్తనాలు వంటి వాటితో కలిపి తింటే లైకోపీన్ను శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది. అయితే పచ్చి టమాటాలను తినడం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. పచ్చి టమాటాలను తింటే విటమిన్ సి ని అధికంగా పొందవచ్చు. టమాటాలను ఉడికిస్తే విటమిన్ సి ని కోల్పోతాము. కానీ లైకోపీన్ ఎక్కువగా లభిస్తుంది. కనుక విటమిన్ సి కావాలంటే టమాటాలను పచ్చిగానే తినాలి. అదే లైకోపీన్ కావాలంటే ఉడకబెట్టి తినాలి. కొందరు రెండు రకాల టమాటాలను కలిపి తింటారు. దీంతో రెండు పోషకాలను ఒకేసారి పొందవచ్చు. టమాటాలను రోజుకు 2 లేదా 3 కు మించి తినకూడదు. కూరల్లో వేసినా, ఉడికించి లేదా పచ్చిగా తిన్నా 3 టమాటాలకు మించి తినకూడదు. ఇలా టమాటాలను తింటుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.