Hormonal Acne | అందంగా కనిపించేందుకు టీనేజర్లు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ముఖ్యంగా టీనేజీలో మొటిమలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. ముఖంపై మొటిమలు కనిపించగానే టీనేజర్లు చాలా ఇబ్బందిపడిపోతున్నారు. బయటకు వెళ్లాలంటే ఆత్మన్యూనతకు గురవుతున్నారు. టీ జోన్ హార్మోన్ల మొటిమలు కౌమార దశలో సాధారణ సమస్య. టీ-జోన్ హార్మోన్ల మొటిమలు ముఖ్యంగా గడ్డం, ముక్కు, చెంపలు, నుదుటిపై కనిపిస్తుంటాయి.
చర్మం కింద పొరల్లో ఉండే కొవ్వు పొరలో కొన్ని కారణాల చేత అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు, నల్లటి వలయాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కనిపించడం ప్రారంభమవుతుంది. మొటిమల ఇన్ఫెక్షన్ కారణంగా వైట్, బ్లాక్ హెడ్స్ వస్తుంటాయనేది అపోహ మాత్రమే. సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంద నిద్ర లేకపోవడం, నిత్యం వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలి కారణాలతో మొటిమలు పుట్టుకొస్తుంటాయి.
ఎలా ఏర్పడతాయి..
టీనేజిలో హార్మోన్ల స్థాయి పెరుగుదల సెబాషియన్ గ్రంథులను ఎక్కువ సెబమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సెబమ్ చనిపోయిన చర్మ కణాలు, ఇతర వ్యర్థాలతో గుచ్చుకుని జుట్టు కుదుళ్లను అడ్డుకుంటుంది. ఫలితంగా మొటిమలకు దారితీస్తుంది. మొటిమల కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాల్లో సీ ఆక్నేస్ అనే బ్యాక్టీరియా వ్యాపించి మంటకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో రుతుచక్రం, మెనోపాజ్ వంటి వివిధ కారకాలు హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుండటంతో మొటిమలు వస్తుంటాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటివి కూడా హార్మోన్ మొటిమలకు కారణమవుతాయి.
వాటికి కారణాలివీ..
తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆండ్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి మొటిమలకు కారణమవుతాయి.
మనం ఉపయోగించే జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు కూడా మొటిమలు రావడానికి కారణం.
లిథియం లేదా యాంటీ కన్వల్సెంట్ వంటి మందుల వల్ల కూడా మొటిమలు వస్తాయి.
నివారణ ఇలా..
తేలికపాటి మొటిమలకు ఓవర్ ది కౌంటర్ మందులతో చికిత్స ఇవ్వవచ్చు.
యాంటీ బ్యాక్టీరియల్ స్కిన్ క్లెన్సర్లను ఉపయోగించాలి.
ముఖం భాగం పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
రోజులో కనీసం మూడుసార్లు ముఖాన్ని సబ్బుతో శుభ్రపర్చుకోవాలి.
బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.
ముఖంపై యూవీ కిరణాలు పడకుండా చూసుకోవాలి.
గర్భనిరోధక మాత్రలతో మొటిమలను తగ్గించుకోవచ్చు.
ఏ విటమిన్‌తో తయారైన రెటినోయిడ్స్ ఉపయోగించాలి.
యాంటీ ఆండ్రోజెన్ డ్రగ్స్ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
టీ ట్రీ ఆయిల్‌తో ముఖం శుభ్రపరుచుకోవడం వల్ల మొటిమలు దూరం అవుతాయి.
గ్రీన్ టీ తాగడం వల్ల కూడా దూరమవుతాయి.
రిఫైన్డ్ గ్రెయిన్స్ తీసుకోకుండా చూడాలి.
డెయిరీ ఉత్పత్తులను దూరం పెట్టాలి.
ఫాస్ట్ఫుడ్స్, చాక్లెట్స్ తినకుండా ఉండాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.