ఛత్రపతి శంభాజీనగర్: ఆహార, ఔషధ పరిపాలన(ఎఫ్డీఏ) అధికారిని జనం చుట్టుముట్టి, గడువు దాటిపోయిన బిస్కెట్ ప్యాకెట్లను ఆయన ముందుకు తీసుకువచ్చారు. దుకాణదారుడిని కాపాడేందుకు సదరు అధికారి లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ, అతనిని చుట్టుముట్టి ‘నువ్వే వీటిని తిను’ అంటూ నినాదాలు చేశారు. ఆ గందరగోళంలో కొందరు ఆ బిస్కెట్లను ఆయన నోట్లోకి బలవంతంగా తోసేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానిక పాన్ షాపులో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను అమ్ముతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వివాదం చెలరేగింది. సదరు దుకాణంలోని చిరు తిండి పొట్లాన్ని తిన్న తర్వాత రెండేండ్ల చిన్నారి అస్వస్థతకు గురవ్వటం వివాదాన్ని రేపింది.