Long Pepper | ఆయుర్వేదలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. వాటిల్లో పిప్పళ్లు కూడా ఒకటి. మిరియాల జాతికి చెందిన ఇవి కూడా ఘాటుగానే ఉంటాయి. పిప్పళ్లు మనకు ఆయుర్వేద స్టోర్స్‌లో లభిస్తాయి. పిప్పళ్లను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వీటిల్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పిప్పళ్లను పలు రకాలుగా ఉపయోగించడం వల్ల వ్యాధులను తగ్గించుకోవచ్చు. అనేక రకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులకు పిప్పళ్లు ఔషధంలా పనిచేస్తాయి. పిప్పళ్లను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడంలో పిప్పళ్లు ఎంతగానో మేలు చేస్తాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, అధిక కఫం వంటి సమస్యలను పిప్పళ్లు తొలగిస్తాయి.
పావు నుంచి అర టీస్పూన్ పిప్పళ్ల చూర్ణం తీసుకుని దానికి 1 టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. ఇలా చేస్తుంటే గొంతులో నొప్పి, గరగర, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. జలుబు నుంచి త్వరగా బయట పడవచ్చు. రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. పిప్పళ్లను అల్లంతోపాటుగా కూడా కలిపి ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో కొద్దిగా పిప్పళ్ల చూర్ణం వేయాలి. కాస్త తురిమిన అల్లం, 3 లేదా 4 తులసి ఆకులు వేసి స్టవ్‌ను సిమ్‌లో ఉంచి మరిగించాలి. 5 నిమిషాలపాటు మరిగించిన తరువాత వడకట్టి అందులో కాస్త తేనె కలిపి తాగేయాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాల్సి ఉంటుంది. ఇలా చేస్తున్నా కూడా దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
పావు టీస్పూన్ పిప్పళ్ల చూర్ణం, కొద్దిగా పసుపు, 1 టీస్పూన్ తేనెలను తీసుకుని కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న ఆస్తమా తగ్గుతుంది. ఇతర శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా పిప్పళ్లు ఎంతగానో మేలు చేస్తాయి. చిటికెడు పిప్పళ్ల పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు లేదా ఒక గ్లాస్ మజ్జిగతోపాటు తీసుకోవాలి. దీంతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. గ్యాస్ పోతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు నొప్పి నుంచి త్వరగా బయట పడవచ్చు. మలబద్దకం ఉన్నవారికి కూడా పిప్పళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకు గాను పావు టీస్పూన్ పిప్పళ్ల చూర్ణాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి రాత్రి పూట నిద్రకు ముందు తాగాలి. అయితే కొందరికి ఇది విరేచనాలను కలిగించవచ్చు. కనుక చూసి వాడుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం ఉండదు.
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో, మెటబాలిజంను మెరుగు పరిచి కొవ్వు కరిగేలా చేయడంలోనూ పిప్పళ్లు పనిచేస్తాయి. చిటికెడు పిప్పళ్ల చూర్ణాన్ని తేనె లేదా గోరు వెచ్చని నీటితో కలిపి ఉదయం తీసుకుంటుండాలి. ఇలా చేస్తుంటే జీర్ణాశయంలో అగ్ని పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా కొవ్వు మొత్తం కరిగి బయటకు వెళ్లిపోతుంది. అలాగే పిప్పళ్ల పొడిని మిరియాల పొడి, శొంఠి పొడి, తేనెలతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటున్నా శరీరం డిటాక్స్ అవుతుంది. కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇలా పిప్పళ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో పిప్పళ్లను వాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.