Holi Celebrations | రంగులు చల్లుకుని సరదాలు పంచుకునే పండుగ.. హోలీ! రసాయన వర్ణాల వల్ల కళ్లు మండటం, చర్మానికి దద్దుర్లు రావడం తదితర సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తప్పవు.
సింథటిక్ రంగులలో కంటికి, చర్మానికి హాని చేసే పాదరసం, సీసం, అల్యూమినియం బ్రోమైడ్ లాంటి రసాయనాలు ఉంటాయి. ఇవి ఎలర్జీలకు, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి గంధం, హెన్నా, పసుపు తదితర సహజసిద్ధ వర్ణాలతోనే హోలీ ఆడాలి.
రంగుల వేడుక సమయంలో కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. దీనివల్ల కళ్లలోకి రంగులు పోకుండా అద్దాలు అడ్డుకుంటాయి. ఒంటిని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరిస్తే.. చర్మ ఎలర్జీలను అడ్డుకోవచ్చు. రంగులాటకు వెళ్లే ముందే ముఖానికి, కాళ్లూ చేతులకు మాయిశ్చరైజర్ పూసుకోవడం మంచిది. రంగులు చర్మం లోపలి పొరల్లోకి వెళ్లకుండా ఆ తేమ అడ్డుకుంటుంది. ప్రత్యామ్నాయంగా కొబ్బరినూనె రాసుకున్నా మంచిదే.
వాటర్ కలర్స్ వాడేటప్పుడు.. ముఖంపై కాకుండా ఒంటిపై చల్లుకోమని పిల్లలతో చెప్పండి. పెంపుడు జంతువులు, వీధి కుక్కల మీద రంగులు చల్లొద్దని కూడా హెచ్చరించండి. ఆ ప్రభావంతో మూగ జీవాలకు చర్మ సమస్యలు రావచ్చు.
వాటర్ బెలూన్స్‌తో హోలీ ఆడటం ఇప్పుడు ట్రెండ్. బెలూన్స్‌ను నేరుగా ముఖం మీదికి విసరడం వల్ల అవి పగిలిపోయి అందులోని రంగునీళ్లు ముక్కులోకి, కళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల ఉదర సంబంధ వ్యాధులు దరిచేరవచ్చు.