Hip Problems | కోవిడ్ మహమ్మారి తర్వాత భారత్‌లో మరో ఆందోళనకర ఆరోగ్య సమస్య వేగంగా పెరుగుతోందని ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువకులు, మధ్య వయస్కుల్లో హిప్ జాయింట్ సమస్యలు, అవాస్క్యులర్ నెక్రోసిస్ (AVN) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ సమస్య వల్ల హిప్ ఎముకకు రక్త సరఫరా తగ్గిపోవడం లేదా ఆగిపోవడం జరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి, నడవడంలో ఇబ్బంది, కీళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. ఢిల్లీలో నిర్వహించిన 2వ ఢిల్లీ హిప్ 360 కాన్ఫరెన్స్‌లో నిపుణులు మాట్లాడుతూ కోవిడ్ తర్వాత కాలంలో హిప్ జాయింట్ల నష్టం వేగంగా పెరిగిందని, దీంతో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సల సంఖ్య కూడా అధికమవుతోందని తెలిపారు. ఈ సమావేశాన్ని ఢిల్లీ ఆర్థోపెడిక్ అసోసియేషన్, ఇండియన్ ఆర్థ్రోప్లాస్టీ అసోసియేషన్ కలిసి నిర్వహించాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు ఇందులో పాల్గొని హిప్ జాయింట్ సమస్యలపై తాజా సాంకేతికతలు, చికిత్సా విధానాలపై చర్చించారు.
వైద్యులు తెలిపిన ప్రకారం ప్రస్తుతం ఆసుపత్రులకు తీవ్రమైన హిప్ నొప్పి, కుంటుతూ నడవడం, కీళ్లు గట్టిపడటం వంటి సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా AVN, ప్రారంభ దశ హిప్ ఆర్థరైటిస్ సమస్యలు 30 నుంచి 40 ఏళ్ల వయసువారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
కోవిడ్ చికిత్స సమయంలో ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువకాలం స్టెరాయిడ్లు వాడటం AVN ప్రమాదాన్ని పెంచే అవకాశముందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచించాయి. ముఖ్యంగా ఇప్పటికే రక్తనాళాలు లేదా మెటబాలిజం సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. AVN ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు. చాలామంది తొలిదశలో వచ్చే తొడ భాగ నొప్పి లేదా గట్టిదనాన్ని సాధారణ కండరాల నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా సమస్య గుర్తించే సమయానికి హిప్ జాయింట్ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి నడక సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అవసరమవుతుంది.
కోవిడ్ సమయంలో స్టెరాయిడ్లు అనేక మంది ప్రాణాలను కాపాడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అవి అధికంగా లేదా నియంత్రణ లేకుండా వాడటం వల్ల ఎముకలకు రక్త సరఫరా తగ్గి హిప్ జాయింట్ త్వరగా దెబ్బతినే ప్రమాదం పెరిగింది. ప్రస్తుతం చిన్న వయసులోనే హిప్ ఎముక కుంగిపోవడం, తీవ్రమైన ఆర్థరైటిస్‌తో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమవుతున్న రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే జాయింట్‌ను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేకుండా చికిత్స చేసే అవకాశాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. MRI వంటి పరీక్షల ద్వారా తొందరగా గుర్తించడం చాలా కీలకమని చెబుతున్నారు.
సమావేశంలో రోబోటిక్ సహాయంతో చేసే హిప్ శస్త్రచికిత్సలు, అధునాతన ఇంప్లాంట్లు, తక్కువ గాయాలతో చేసే విధానాలు, వేగవంతమైన రికవరీ టెక్నిక్స్ వంటి ఆధునిక చికిత్సా పద్ధతులపై కూడా చర్చ జరిగింది. కొత్త సాంకేతికతల వల్ల రోగులు శస్త్రచికిత్స తర్వాత త్వరగా సాధారణ జీవితానికి చేరుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్తులో హిప్ రీప్లేస్మెంట్ అవసరమయ్యే రోగుల సంఖ్య భారత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కోవిడ్ తర్వాత కూడా కొనసాగుతున్న హిప్ నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే స్టెరాయిడ్లను వైద్యుల సలహా మేరకే వాడాలని, అవగాహన పెంచడం ద్వారా యువతలో తీవ్రమైన కీళ్ల నష్టం, వైకల్యాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.