Himalayan Salt Vs Sea Salt | ఈమధ్య కాలంలో మనం రహదారుల పక్కన ఎక్కడ చూసినా పెద్దవైన పింక్ రంగు స్ఫటికాలను పెట్టుకుని విక్రయిస్తున్నారు. మీరు చూసే ఉంటారు కదా. అయితే అవి ఏంటా.. అని ఆశ్చర్యపోతున్నారా..? అవి హిమాలయన్ పింక్ సాల్ట్ స్ఫటికాలు. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని నదుల నుంచి సేకరించిన స్ఫటికాలు అవి. దీన్నే రాక్ సాల్ట్ అంటారు. దీన్నుంచే సైంధవ లవణాన్ని కూడా తయారు చేస్తారు. అయితే చాలా కంపెనీలు హిమాలయన్ సాల్ట్‌ను కూడా విక్రయిస్తున్నాయి. మరి దీనికి, రోజూ మనం తినే సాధారణ ఉప్పుకు అసలు తేడా ఏమిటి..? రెండింటిలో ఏది మంచిది..? దీనిపై నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారు..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని లక్షల ఏళ్ల కిందట నుంచే ఏర్పడ్డ స్ఫటికాలను హిమాలయ నదీ ప్రాంతం నుంచి సేకరించి వాటిని ఉప్పుగా చేసి మనకు విక్రయిస్తున్నారు. అందువల్ల ఈ ఉప్పుకు హిమాలయన్ సాల్ట్ అనే పేరు వచ్చింది. మార్కెట్లో మనకు ఎక్కడ చూసినా పింక్ రంగులో ఉండే ఈ స్ఫటికాలు కనిపిస్తుంటాయి. వీటినే శుద్ధి చేసి మనకు ఉప్పు విక్రయిస్తున్నారు. అయితే పింక్ సాల్ట్‌లో ఉండే 84 రకాల మినరల్స్ కారణంగానే వాటికి ఆ రంగు వచ్చింది. సాధారణ ఉప్పులో ఉండని అనేక రకాల మినరల్స్ ఈ హిమాలయన్ సాల్ట్‌లో ఉంటాయని తేలింది. కనుకనే ఈ ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
హిమాలయన్ సాల్ట్ ను ఒక టీస్పూన్ తీసుకుంటే 2200 మిల్లీగ్రాముల మేర సోడియం లభిస్తుంది. అదే సాధారణ ఉప్పులో అయితే ఒక టీస్పూన్ మోతాదులో సుమారుగా 2300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అంటే సాధారణ ఉప్పుతో పోలిస్తే హిమాలయన్ ఉప్పులో సోడియం కాస్త తక్కువ. ఇక ఇతర మినరల్స్ కూడా హిమాలయన్ సాల్ట్‌లోనే ఉంటాయి. అందువల్ల ఈ ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు. హిమాలయన్ ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉప్పు కన్నా హిమాలయన్ ఉప్పు మంచిదని వారు అంటున్నారు. హిమాలయన్ ఉప్పుతో చేసిన దీపాలను వెలిగిస్తే చుట్టూ ఉండే గాలి కూడా శుద్ధి అవుతుందట.
అయితే సాధారణ ఉప్పుకు, హిమాలయన్ ఉప్పుకు సోడియంలో పెద్ద తేడా లేదు. కానీ మినరల్స్‌లో తేడా ఉంటుంది. కనుక మినరల్స్ పొందాలని అనుకునేవారు సాధారణ ఉప్పుకు బదులుగా హిమాలయన్ ఉప్పు తినవచ్చని అంటున్నారు. అయితే ఏ ఉప్పు అయినా కూడా ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాములు లేదా ఒక టీస్పూన్‌కు మించి తినకూడదని, అధికంగా తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయని, దీంతో కిడ్నీలపై భారం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుందట. అలాగే బీపీ కూడా పెరుగుతుందని అంటున్నారు. కనుక హిమాలయన్ ఉప్పు ఆరోగ్యానికి కాస్త మేలు చేసినప్పటికీ దీన్ని కూడా మోతాదులో తింటేనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అధికంగా తింటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.