Uric Acid Levels | శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరితే దీర్ఘకాలంలో గౌట్ లేదా కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరడాన్ని హైపర్ యురిసిమియా అంటారు. ఇలాంటి స్థితి దీర్ఘకాలంగా ఉంటే గౌట్ ఏర్పడుతుంది. కిడ్నీల్లో రాళ్లు కూడా వస్తాయి. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోయేందుకు అనేక కారణాలు ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరుతుంది. ప్రోటీన్లలో ప్యూరిన్లు అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో చేరినప్పుడు యూరిక్ యాసిడ్‌గా మారుతాయి. ఈ క్రమంలో ప్రోటీన్లను మోతాదుకు మించి అధికంగా తింటే శరీరంలో దీర్ఘకాలంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే మద్యం అధికంగా సేవించడం, చక్కెర అధికంగా తినడం, కిడ్నీ సమస్యలు, అధికంగా బరువు ఉండడం, డీహైడ్రేషన్ వంటి కారణాల వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.
యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిన తరువాత కొందరికి కిడ్నీ స్టోన్లు ఏర్పడితే కొందరికి గౌట్ వస్తుంది. కిడ్నీ స్టోన్స్ అంటే అందరికీ తెలుసు. ఇక గౌట్ అంటే కీళ్లలో స్ఫటికాల వంటి రాళ్లు ఏర్పడుతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. ముఖ్యంగా పాదాలు, చేతుల్లో ఉండే కీళ్లలో ఈ స్ఫటికాలు ముందుగా ఏర్పడుతాయి. అందుకనే ఈ భాగాల్లోనే విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ లక్షణం కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. పరీక్షలు చేయించుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నాయని, గౌట్ ఉందని తేలితే డాక్టర్ ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. దీనికితోడు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. ఆహారాన్ని పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. కొందరు ఆహారంపై పూర్తిగా నియంత్రణ సాధించి తమకు ఉన్న గౌట్ సమస్యను దూరం కూడా చేసుకుంటున్నారు. ఇది దీర్ఘకాల జబ్బు కాదు, ఆహారంతో దీన్ని వెనక్కి మళ్లించవచ్చు. కనుక ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గౌట్ ఉన్నవారు నీళ్లను అధికంగా తాగాలి. దీని వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు, ముఖ్యంగా యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు పోతుంది. దీంతో కీళ్లలో ఉండే స్ఫటికాలు కరిగి బయటకు పోతాయి. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రోటీన్లు ఉండే ఆహారాలను పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. పప్పు దినుసులు, మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, ఇతర మాంసాహారాలను కొంతకాలంపాటు పూర్తిగా మానేయాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. అలాగే మద్యం పూర్తిగా మానేయాలి. శీతల పానీయాలను కూడా సేవించకూడదు. ఎనర్జీ డ్రింక్స్, ఇతర కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు సైతం దూరంగా ఉండాలి. చక్కెర వాడకాన్ని పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. కానీ చాలా తక్కువగా తినాలి. తియ్యని పండ్లను కూడా మోతాదులోనే తినాలి.
ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కాలిఫ్లవర్, పుట్టగొడుగులు, విటమిన్ సి అధికంగా ఉండే చెర్రీలు, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలను తింటుండాలి. నిమ్మజాతికి చెందిన నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లను తింటుండాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా, హోల్ వీట్ బ్రెడ్, పాస్తా వంటివి తినవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే శరీరంలో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక కొవ్వు తీసిన పాలు, పెరుగు వంటివి తీసుకోవచ్చు. అలాగే కోడిగుడ్లను మోతాదులో తినవచ్చు. చీజ్, పనీర్ లను కూడా మోతాదులోనే తినాలి. క్యాప్సికం, కివి, జామ, ఉసిరి, బ్రోకలీ వంటి పండ్లను, కూరగాయలను తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీని సేవిస్తుండాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఇలా డైట్, సూచనలు పాటిస్తే కొంత కాలానికి యూరిక్ యాసిడ్ పూర్తిగా పోతుంది. గౌట్ తగ్గుతుంది. మళ్లీ సాధారణ జీవితం గడపవచ్చు.