High Blood Pressure | ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. వయసు పైబడిన వారిలోనే కాకుండా యువతలో కూడా మనం ఈ సమస్యను చూడవచ్చు. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, అధిక బరువు, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే ఇక ప్రతిరోజూ మందులు మింగాల్సిందే. అయితే ఇప్పుడు చెప్పే సాధారణ చిట్కాలను పాటించడం వల్ల రక్తపోటు నుండి బయటపడడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. రక్తపోటును సహజంగా తగ్గించే చిట్కాల గురించి ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
అధిక రక్తపోటుతో బాధపడే వారు ముందుగా శరీర బరువును తగ్గించుకోవాలి. 3 నుండి 5 కిలోల బరువు తగ్గడం కూడా అధిక రక్తపోటుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రక్తపోటును తగ్గించుకోవచ్చు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తపోటుకు వాడే మందుల మోతాదును గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా రక్తపోటుతో బాధపడే వారు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటుతో బాధపడే వారు వారు తీసుకునే ఆహారంలో సోడియం తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ 1500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా సోడియంను తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మద్యం సేవించడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటుతో బాధపడే వారు పూర్తిగా మద్యం తీసుకోవడం మానేయాలి లేదా మద్యం తీసుకోవడం తగ్గించాలి. ఇక కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి రక్తపోటు ఉన్నవారికి ఇది మంచిది కాదు. కాఫీ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కనుక రక్తపోటుతో బాధపడే వారు కాఫీ తాగడాన్ని తగ్గించాలి.
అదేవిధంగా నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు వస్తుంది. కనుక 6 నుండి 8 గంటలు కచ్చితంగా నిద్రించాలి. దీని వల్ల రక్తపోటు స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఒత్తిడితో బాధపడే వారిలో కూడా రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కనుక రోజూ ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇక ధూమపానం కూడా రక్తపోటు స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఇది రక్తనాళాలకు కూడా హానిని కలిగిస్తుంది. కనుక రక్తపోటుతో బాధపడే వారు ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. ఈ విధమైన చర్యలను తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.