Lemon Leaves | నిమ్మకాయలను వాడడం వల్ల ఎన్ని ఉపయోగాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నిమ్మరసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. నిమ్మరసాన్ని కొందరు నేరుగా తాగుతారు. కొందరు గోరు వెచ్చని నీటిలో కలిపి సేవిస్తుంటారు. ఆయుర్వేద ప్రకారం నిమ్మరసం మనకు అనేక లాభాలను అందిస్తుంది. ఎంతో పురాతన కాలం నుంచే నిమ్మకాయలను ఆహారంగా, ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అనేక సంప్రదాయ వైద్య విధానాల్లోనూ నిమ్మకాయలను వాడుతారు. అయితే కేవలం నిమ్మకాయలు మాత్రమే కాదు, నిమ్మ ఆకులు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి వ్యాధులను తగ్గిస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగవచ్చు. ఈ మిశ్రమం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని ఒక కప్పు మోతాదులో రోజుకు 2 సార్లు తాగవచ్చు. మీరు రోజూ తాగే టీ, కాఫీలకు బదులుగా ఈ నిమ్మ ఆకుల టీని సేవిస్తుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. నిమ్మ ఆకుల టీలో అల్లం రసం కలిపి కూడా తాగవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. నిమ్మ ఆకుల టీని సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మెదడు ప్రశాంతంగా మారుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఈ ఆకుల టీని సేవిస్తుంటే నాడీ మండల వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. టెన్షన్ మొత్తం తగ్గిపోయి ప్రశాంతంగా మారుతారు. అలసట, నీరసం తగ్గిపోతాయి.
నిమ్మ ఆకుల టీని సేవిస్తుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి పెరుగుతుంది. నిమ్మ ఆకుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన టీని రోజుకు 2 సార్లు తాగుతుంటే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఆ ఆకుల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో దగ్గు, జలుబు తగ్గిపోతాయి. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
నిమ్మ ఆకులు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని చెట్టు నుంచి తెంపిన తరువాత శుభ్రంగా కడగాలి. లేదంటే ఆకులపై ఉండే కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారక మందుల తాలూకు అవశేషాలు మన శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు సేంద్రీయ పద్ధతిలో పెంచిన నిమ్మ చెట్ల నుంచి సేకరించిన ఆకులను వాడితే మంచిది. కొందరికి సిట్రస్ అలర్జీ ఉంటుంది. అలాంటి వారు నిమ్మ ఆకులను ఉపయోగించకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు నిమ్మ ఆకులను వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. నిమ్మ ఆకులతో తయారు చేసిన నీళ్లను స్నానం చేసే నీటిలో పోసి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం తాజాగా మారుతుంది. చెమట వాసన రాకుండా ఉంటుంది. నిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. నిమ్మ ఆకుల పేస్ట్‌లో పెరుగు కలిపి జుట్టుకు రాస్తుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. కాంతివంతంగా కనిపిస్తాయి. ఇలా నిమ్మ ఆకులతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.