Herbs To Use In Winter | చలి తీవ్రత కారణంగా అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన చలి కారణంగా విపరీతమైన దగ్గు, జలుబుతోపాటు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే ఈ అనారోగ్య సమస్యలు తగ్గేందుకు సహజంగానే చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. దీంతో సమస్య తాత్కాలికంగా తగ్గినా కూడా మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద మూలికలను ఈ సీజన్లో వాడితే దాంతో మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఆ ఆయుర్వేద మూలికలు ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన చుట్టూ పరిసరాల్లో తిప్పతీగ పెరుగుతుంది. దీని కాండం కాస్త మందంగా ఉంటుంది. అయితే తిప్ప తీగ ఆకులను తెచ్చి రసం తీసి తాగవచ్చు. రోజుకు రెండు సార్లు అర టీస్పూన్ చొప్పున తిప్పతీగల ఆకుల రసం తాగుతుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఫలితంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ సీజన్లో పసుపును కూడా రోజూ వాడాలి. పాలలో పసుపును కలుపుకుని రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. భోజనం అనంతరం ఇలా చేయాల్సి ఉంటుంది. పసుపులో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు, రోగాలనైనా తగ్గిస్తాయి. చలికాలంలో వచ్చే ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించేందుకు కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ సమస్యల నుంచి బయట పడాలంటే రోజూ పసుపు పాలను తాగాల్సి ఉంటుంది.
శ్వాసకోశ సమస్యలను, సీజనల్ వ్యాధులను తగ్గించడంలో తులసి ఆకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. తులసి ఆకులను నాలుగు తీసుకుని ఉదయాన్నే పరగడుపునే అలాగే తినవచ్చు. లేదా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కప్పు మోతాదులో ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగవచ్చు. ఇలా తులసిని తీసుకుంటే ఎన్నో రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి రోగ నిరోధక శక్తిని పెంచడంలో అశ్వగంధ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అశ్వగంధ చూర్ణం, ట్యాబ్లెట్లు కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిని డాక్టర్ సలహా మేరకు వాడుకోవచ్చు. అశ్వగంధ చూర్ణాన్ని పావు టీస్పూన్ మోతాదులో ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని పాలలో కలిపి తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను కాస్త దంచి నేరుగా అలాగే తినేయాలి. ఇవి ఘాటుగా ఉంటాయి కనుక వీటిని తినేటప్పుడు నాలుక మండకుండా ఉండేందుకు గాను కాస్త తేనెతో కలిపి వెల్లుల్లిని తినవచ్చు. ఇలా పలు రకాల మూలికలను తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.