Herbal Teas | మనలో చాలా మంది ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. అలాగే ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత కూడా టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఉదయం పూట టీ, కాఫీలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి హాని తప్ప ఎటువంటి మేలు కలగదు. వీటికి బదులుగా ఉదయం పూట హెర్బల్ టీ లను తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెర్బల్ టీలలో కెఫిన్ ఉండదు. వీటిని మూలికలు, పూలు, విత్తనాలు, వేర్లు వంటి వాటితో తయారు చేస్తారు. తరుచూ తాగే టీ ల మాదిరి కాకుండా వీటికి వాడే మూలికలను బట్టి వీటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు మారతాయి. హెర్బల్ టీలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఉదయం పూట హెర్బల్ టీలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
రాత్రి చాలా సమయం నిద్రించిన తరువాత శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. కనుక ఉదయం నిద్రలేచిన తరువాత హెర్బల్ టీను తాగడం వల్ల శరీరం తిరిగి హైడ్రేటెడ్ గా మారుతుంది. పుదీనా లేదా మందార వంటి వాటితో హెర్బల్ టీలను తయారు చేసి తీసుకోవడం వల్ల రీఫ్రెష్మెంట్ గా ఉండడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. హెర్బల్ టీలలో కెఫిన్ ఉండదు. ఈ టీలను తాగడం వల్ల ఎటువంటి గందరగోళం లేకుండా మన ఉదయం చాలా సజావుగా ఉంటుంది. అల్లం లేదా నిమ్మకాయలతో చేసే టీ లలో ఉండే ఉత్తేజకరమైన మిశ్రమాలు శరీర అవయవాలను సున్నితంగా, సహజంగా మేల్కొల్పుతాయి.
పుదీనా, అల్లం, సోంపు వంటి మూలికలతో చేసే హెర్బల్ టీ లు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ టీ లను తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. మనం తీసుకునే ఆహారాల్లో ఉండే పోషకాలు కూడా శరీరానికి చక్కగా అందుతాయి. రేగుట, తులసి, డాండెలైన్ వంటి హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. దీంతో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి. దీంతో శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టీ లు ఫ్లేవనాయిడ్స్, పాలీఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. హెర్బల్ టీలను తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరానికి రోజంతా ఒక రక్షణ కవచంలా ఈ టీలు పని చేస్తాయి.
గ్రీన్ రూయిడోస్, దాల్చిన చెక్క వంటి వాటితో చేసే హెర్బల్ టీలను తాగడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ టీలను రోజూ క్రమం తప్పకుండా ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. లావెండర్, అశ్వగంధ, కమోమిల్ వంటి హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడినుండి ఉపశమనం కలుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. స్పియర్మింట్ లేదా లికోరైస్ రూట్ వంటి మూలికలతో చేసే హెర్బల్ టీను తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. ముఖ్యంగా పీఎమ్ఎస్, మెనోపాజ్ లక్షణాలతో బాధపడే మహిళలు ఉదయం పూట ఒక కప్పు హెర్బల్ టీ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కాఫీ, టీలను తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుంది. వాటికి బదులుగా హెర్బల్ టీలను తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది. యాసిడ్ రిప్లెక్స్ తగ్గుతుంది. ఈ టీలను తాగడం వల్ల పేగుపూత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. హెర్బల్ టీలు అనేక రకాలుగా మన శరీరానికి మేలు చేస్తాయి. మన శరీర అవసరాలకు తగినట్టు వీటిని తీసుకోవచ్చు. ఈ టీలను తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.