Herbal Teas In Monsoon | వర్షాకాలంలో సహజంగానే అందరికీ అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాల బారిన పడుతుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధులు త్వరగా అటాక్ అవుతుంటాయి. పైగా వారికి ఇవి ఒక పట్టాన తగ్గవు. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు గాను పలు హెర్బల్ టీలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వర్షాకాలంలో హెర్బల్ టీలను సేవించడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం ఈ టీ లు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. నీరు, గాలి, ఆహారం కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే బద్దకం నుంచి బయట పడవచ్చు. యాక్టివ్గా మారుతారు. ఉత్సాహంగా ఉంటారు. ఇక అందుకు ఏయే హెర్బల్ టీ లు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం, తులసి చాలా మంది ఇళ్లలో ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చిన్న అల్లం ముక్కను, కొన్ని తులసి ఆకులను కొన్ని నీళ్లలో వేసి మరిగించి వడకట్టి ఆ నీళ్లను గోరు వెచ్చగా ఉండగా తాగేయాలి. రుచి కోసం అందులో అవసరం అనుకుంటే కాస్త నిమ్మరసం, తేనెను కలపవచ్చు. పసుపు టీ కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. కొన్ని నీటిలో కొద్దిగా పసుపు, తురిమిన అల్లం, నల్ల మిరియాల పొడి వేసి బాగా మరిగించి అనంతరం ఆ నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. అలాగే వాము గింజలు, సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి తాగుతున్నా ఉపయోగం ఉంటుంది. లెమన్ గ్రాస్, కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. దాల్చిన చెక్క పొడి లేదా ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా పలు రకాల హెర్బల్ టీలను మీరు మీ ఇంట్లోనే తయారు చేసి తాగవచ్చు. వీటితో అనేక లాభాలను పొందవచ్చు.
హెర్బల్ టీలను ఇంట్లో తయారు చేసి తాగడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం, తులసి, పసుపు వంటి పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మార్చి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. హెర్బల్ టీలను సేవించడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దీని వల్ల అజీర్తి తగ్గుతుంది. అల్లం, పుదీనా, వాము, సోంపు గింజల్లో ఉండే సమ్మేళనాలు కార్మినేటివ్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆకలి పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
హెర్బల్ టీలను సేవించడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, ఒళ్లు నొప్పుల నుంచి బయట పడవచ్చు. శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. పసుపు, అల్లం, దాల్చిన చెక్కలలో శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఒళ్లు నొప్పులను తగ్గించి వాపుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. హెర్బల్ టీలను సేవిస్తుంటే శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. ఇందుకు లెమన్ గ్రాస్ టీ చక్కగా పనిచేస్తుంది. దీన్ని సేవిస్తుంటే లివర్, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హెర్బల్ టీలను సేవించడం వల్ల ఒత్తిడి, ఆందోళ సైతం తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా వర్షాకాలంలో హెర్బల్ టీలను సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.