స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇక పిల్లల తల్లులకు లంచ్‌బాక్స్ అనేది సవాలే. పిల్లలకు ఏం పెట్టాలి అని ప్రతిరోజూ ఆలోచిస్తూ ఉంటారు. ఎదిగే పిల్లలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన లంచ్ పెట్టాలి. అలాగే, ఎదిగే వయస్సు కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం అందించాలి. అప్పుడే పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది. కాగా, పిల్లలు ఇష్టంగా తినే కొన్నిరకాల న్యూట్రిషన్ ఫుడ్ గురించి నిపుణులు వివరించారు.
బీట్రూట్ పరోటా..
పిల్లలు ఆకర్షణీయంగా కనిపించే ఆహారాన్ని ఇష్టపడతారు. పిల్లలకు బీట్రూట్తో పరోటా చేసి పెడితే, ఇష్టంగా స్కూల్‌కు తీసుకెళ్తారు. పింక్ రంగులో ఉండే ఈ బీట్రూట్ పరోటా పిల్లలకు చూడగానే నచ్చుతుంది. అలాగే, బీట్రూట్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాలు.
కూరగాయల హుమ్ముస్
కూరగాయలను ఉడికించి చేసే హుమ్ముస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే, ఇందులో వాడే కూరగాయల్లోని పోషకాలు పిల్లలకు అందుతాయి. హుమ్ముస్ చూడడానికి కలర్ఫుల్గానేకాక రుచికరంగా కూడా ఉండడంతో పిల్లలు ఇష్టంగా లంచ్‌బాక్స్ తీసుకెళ్తారు. క్యారెట్, బఠానీలు, సెలెరీ మొదలైన కొన్ని ఉడికించిన కూరగాయలతో కలిపి హుమ్ముస్ తయారుచేయవచ్చు.
ఎగ్బుర్జీ..
గుడ్డులో పోషకాలు మెండు. ఇందులో ప్రొటీన్స్ ఉంటాయి. అయితే, బాయిల్డ్ ఎగ్ తీసుకునేందుకు బోర్‌గా ఫీలయ్యే పిల్లలకు ఎగ్బుర్జీ చేసి పెట్టొచ్చు. దీన్ని రోటీ, బ్రెడ్ లేదా పూరీతో కలిపి లంచ్‌బాక్స్‌లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
ఇడ్లీ విత్ చట్నీ..
గతరాత్రి భోజనంలో మిగిలిపోయిన ఇడ్లీ ఉందా? అయితే, చట్నీతో కలిపి పిల్లల లంచ్‌బాక్స్‌లో పెట్టేయండి. ఇడ్లీ విత్ చట్నీని పిల్లలు ఇష్టంగా తింటారు.
అవకాడో దోసకాయ శాండ్విచ్..
అవకాడోలో మంచి కొవ్వులు, ప్రొటీన్స్ ఉంటాయి. అవకాడో, దోసకాయ, కొన్నిరకాల చీజ్‌లతో శాండ్విచ్ తయారుచేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పిల్లలకు ఇది ఆరోగ్యకరమైన లంచ్ ఐడియా.