పువ్వు.. పిందె.. కాయ.. పండు!.. బాల్యం, కౌమారం, యవ్వనం!.. ఈ వరుసలో ఒక లంకె మాయమైతే? తొందరపడి ఒక కోయిల ముందేకూసినట్టు, బాల్యం తర్వాత హఠాత్తుగా యవ్వనం ఆరంభమైతే? మహా అయితే నాలుగో తరగతో, ఐదో తరగతో చదువుతున్న ఆ పసిబిడ్డ తనలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోలేక, ఆమోదించలేక అయోమయానికి గురవుతుంది. తన శరీరం తనకే శత్రువులా కనిపిస్తుంది. కూతురిలోని మార్పులను జీర్ణించుకోలేక, ఇరుగుపొరుగు గుసగుసలను భరించలేక నరకం అనుభవిస్తారు తల్లిదండ్రులు. ఈ సమస్యకు వైద్య శాస్త్రంలో పరిష్కారమే లేదా?
కూతురి ఆరోగ్యం విషయంలో కన్నతల్లి అప్రమత్తంగా ఉండాలి. రోజువారీ పనుల్లో ఎంత తీరికలేకున్నా ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. అమ్మాయి శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే, ఏడెనిమిదేండ్లకే బిడ్డ రజస్వల కావచ్చు. దీనివల్ల, ఆ చిట్టితల్లి భవిష్యత్తులో వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. చాలామంది తల్లిదండ్రులు తమ కూతురికి చిరుప్రాయంలోనే రుతుక్రమం మొదలైనా.. తేలిగ్గా తీసుకుంటారే తప్ప, డాక్టర్‌ను సంప్రదించరు. కనీస అవగాహన కూడా ఉండటం లేదు. ఈ సమస్యకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డాక్టర్ మంజుల అనగాని…
కొన్నేండ్ల క్రితం వరకూ ఆడపిల్లల్లో పన్నెండు, పదమూడేండ్ల వయసులో రుతుక్రమం మొదలయ్యేది. రానురానూ అది పదీ పదకొండేండ్లకు వచ్చేసింది. కానీ, ప్రస్తుతం ఆరేడేండ్ల చిన్నారులూ రజస్వల అవుతున్నారు. దీన్ని మాత్రం అసాధారణ పరిణామంగా భావించాలి. ఎందుకంటే, ఆ వయసులో రుతుక్రమం మొదలు కావడం వల్ల పిల్లల్లో రకరకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. పదేండ్ల లోపు పిల్లల శరీరంలో ఏ అసహజ
మైన మార్పు కనిపించినా, వెంటనే నిపుణులను సంప్రదించాలి. దీనివల్ల ఆ ప్రక్రియను కొంతకాలం వాయిదావేసే అవకాశం ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్ ఉత్పత్తి చేసే హార్మోన్లను పిట్యుటరీ గ్రంథి విడుదల చేస్తుంది. తర్వాత అవి అండాశయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే నెలకు ఒక ఇన్జెక్షన్ ద్వారా పిట్యుటరీ స్థాయిలోనే ఈ హార్మోన్లను ఆపేయవచ్చు. తద్వారా రజస్వలను నియంత్రించవచ్చు.
పసితనంలోనే..
ఎనిమిదేండ్ల లోపు పిల్లలకు రుతుక్రమం మొదలైతే, దాన్ని ‘ప్రికా షియస్ ప్యూబర్టీ’ అంటారు. దీన్ని అసాధారణ ప్రక్రియగా పరిగణించాలి. ఆడపిల్లల్లో ఈడు వచ్చేందుకు రెండేండ్ల ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ‘కిలార్కీ’ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి పరిమాణం పెరుగుతుంది. అది జరిగిన ఏడాదికి, పునరుత్పత్తి అవయవాల దగ్గర వెంట్రుకలు మొలుస్తాయి. ఈ మార్పును ‘ప్యూబార్కీ’ అంటారు. తర్వాత ఏడాదికి రుతుక్రమం మొదలవుతుంది. ఎనిమిదేండ్లలోపు పిల్లల్లోనూ ఈ దశలన్నీ ఉంటాయి. కాబట్టి, కొంత మార్పు కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు బోన్ ఏజ్, అమ్మాయి ఎత్తు, బరువు మొదలైనవన్నీ పరీక్షించి, జీఎన్ఆర్హెచ్ అనలాగ్ ఇన్జెక్షన్ల్ల కోర్సు ప్రారంభిస్తారు. అమ్మాయి మానసికంగా, శారీరకంగా ఎదిగిందని నిర్ధారించుకున్నాక ఇంజెక్షన్లు ఆపేస్తారు. ఈ క్రమంలో క్యాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్లను అవసరం మేరకు వాడాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాలేవీ చేయకుండా.. తీరా రజస్వల అయ్యాక, ఎనిమిదేండ్లకే పిల్ల పెద్దగయ్యిందని బాధపడితే లాభం ఉండదు. ఆ దశలో డాక్టర్లను సంప్రదించినా ఫలితం ఉండదు.
నష్టాలేమిటి?
ఎనిమిదేండ్లలోపు పిల్లలు వయసుకు వస్తే, వాళ్లలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఫలితంగా ఎముకల ఎదుగుదల ఆగిపోతుంది. పిల్లల శారీరక పెరుగుదల నిలిచిపోతుంది. ఎనిమిది, తొమ్మిదేండ్లకే ‘సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్’తో అచ్చం పెద్దవాళ్లలా అయిపోతారు. మానసికంగా మాత్రం ఏడెనిమిదేండ్ల స్థాయి లోనే ఉంటారు.
అమాయకత్వమూ అలానే ఉంటుంది. దీంతో వీళ్లపై లైంగిక దాడులు జరిగే ప్రమాదం ఎక్కువ. అలాంటి సందర్భాల్లో ఏది తప్పో ఏది ఒప్పో తెలియక ఇబ్బందుల పాలవుతారు. సమస్య వచ్చినప్పుడు పెద్దలకు చెప్పలేక మానసికంగా కుంగి పోతారు. డిప్రెషన్‌కు లోనయ్యే ఆస్కారాలూ ఉంటాయి. ఈ దశలో ఆత్మ న్యూనతా భావం ఎక్కువగా ఉంటుంది. పైగా తోటిపిల్లల వెక్కిరింతలు ముళ్లలా గుచ్చు కుంటూ ఉంటాయి. ఆ అవమానాలూ, ఆలోచనల మధ్య చదువులో వెనుకబడిపోతారు. చిన్న వయసులోనే రజస్వల అయినవారు, చిన్న వయసులోనే మెనోపాజ్‌కు చేరుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం, డిప్రెషన్, థైరాయిడ్ మొదలైనవి కూడా ఇబ్బంది పెడతాయి. గర్భాశయ క్యాన్సర్ కూడా వీరిలోనే ఎక్కువ.
వాయిదా వేయవచ్చా?
తగిన శారీరక, మానసిక సంసిద్ధత లేని ఎనిమిదేండ్లలోపు అమ్మాయి పెద్దమనిషి కాకుండా నిలువరించే మార్గాలు అనేకం ఉన్నాయి.
ఇంజెక్షన్లతో, క్యాల్షియం సప్లిమెంట్లతో ఏడాది, రెండేండ్ల వరకు రుతుక్రమాన్ని అడ్డుకోవచ్చు. ఇదంతా జరగాలంటే, ముందుగా అమ్మాయి శరీరంలో వచ్చే మార్పులను ముందుగానే గుర్తించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. తర్వాత ఏం చేయాలన్నది నిపుణులే నిర్ణయిస్తారు.
ఆడపిల్లలకు స్నానం చేయించేటప్పుడు, ఛాతిలో వస్తున్న మార్పులను తల్లి జాగ్రత్తగా గమనించాలి. ఛాతి పెరుగుతున్న దశలో పిల్లలకు నొప్పి కలుగుతుంది. కనీసం, ఆ సమయంలో అయినా డాక్టర్‌ను సంప్రదిస్తే సమస్య మూలాలు తెలుస్తాయి. వివిధ పరీక్షలు జరిపి, అది ప్రికాషియస్ ప్యూబర్టీకి సంబంధించిన లక్షణమా, వేరే కారణాలవల్ల అలా జరిగిందా అన్నది తేల్చుతారు. కొన్నిసార్లు ‘బ్రెస్ట్ బడ్’ అనేది సాధారణంగానూ పెరగొచ్చు. ఔషధాల సాయంతో రజస్వల వాయిదా వేయడంవల్ల ఏవైనా దుష్పరిణామాలు ఉంటాయేమోనని చాలామంది భయపడుతుంటారు.
నిజానికి, ప్రికాషియస్ ప్యూబర్టీ అనేదే అసాధారణ ప్రక్రియ. వైద్యశాస్త్రం సాయంతో దీన్ని సాధారణం చేయడంలో ఎలాంటి తప్పూ లేదు. ఈ చికిత్స సమయంలో పిల్లలు ఎంతోకొంత ఎత్తు పెరుగుతారు కూడా. పాప శారీరకంగా, మానసికంగా రజస్వలకు సిద్ధంగా ఉన్నట్టు అనిపించగానే మందులు ఆపేయవచ్చు. అప్పటి నుంచి ఆరు నెలలకో, ఏడాదికో ఆ అమ్మాయి ఎలాంటి సమస్యా లేకుండా వయసుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో తల్లి పిల్లలకు రాబోయే పీరియడ్స్ గురించి, శానిటరీ ప్యాడ్స్ వాడకం గురించి, సమాజంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించీ అవగాహన కలిగించవచ్చు.
కారణాలు అనేకం..
ఈ సమస్యకు ముఖ్య కారణం ఆధునిక జీవన విధానమే. చాలామంది పిల్లలు చదువులు, హోం వర్కుల ఒత్తిడిలో పడిపోయి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు. శారీరక శ్రమ కూడా తగి నంతగా ఉండటం లేదు. జంక్‌ఫుడ్ ఆరగిస్తూ గంటల తరబడి టీవీల ముందు కూర్చుంటున్నారు. ఫలితంగా ఒబేసిటీకి గురవుతున్నారు. పిల్లలు తినేవాటిలో ఈస్ట్రోజెన్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా చాలారకాల కారణాల వల్ల ప్రికాషియస్ ప్యూబర్టీ కేసులు పెరుగుతున్నాయి. పౌష్టికాహారం, వ్యాయామం, ఇంటి భోజనం.. కొంతమేరకు సమస్యను పరిష్కరిస్తాయి. అయినా తప్పకపోతే వైద్యుల సహాయం తీసుకోవాలి.
డాక్టర్ మంజుల అనగాని
క్లినికల్ డైరెక్టర్ ఆఫ్
గైనకాలజీ డిపార్ట్మెంట్,కేర్ హాస్పిటల్స్.
-నిఖిత నెల్లుట్ల