చిన్నగానే మొదలవుతుంది. గడియారం ముల్లు పరుగులు పెట్టేకొద్దీ విన్యాసాలు పతాక స్థాయినిచేరుతాయి. వింతవింత శబ్దాలు, రకరకాల అరుపులు.. పక్కన పడుకున్నవారికి నరకమే. ఒకపూటో రెండు పూటలో అయితే ఫర్వాలేదు. గురక ఓ జీవితకాల రుగ్మత. కానీ, చాలామంది దీనిని ఓ సమస్యగానే భావించరు. ముప్పు ముంచుకొస్తున్నా గాఢనిద్రకు సంకేతమనే అనుకుంటారు.నిపుణులను సంప్రదించరు. చికిత్స తీసుకోరు. వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘స్లీప్ ఏప్నియా’అని పిలుస్తారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే శరీరం రోగాలపుట్ట అవుతుంది. మానసిక రుగ్మతలకూ దారితీయవచ్చు. ఓ దశలో ప్రాణాంతకం కూడా.
గురక.. ఓ శబ్ద పిశాచం. నిద్రపోతున్నప్పుడు ఒకలా వేధిస్తే, మేల్కొన్నప్పుడు ఇంకోలా బాధిస్తుంది. రాత్రిపూట గురకవల్ల గాఢనిద్ర అసాధ్యం. పరిపూర్ణమైన విశ్రాంతి లభించదు. ఇట్టే తెల్లవారిపోయినట్టు అనిపిస్తుంది. అయిష్టంగా మంచం దిగుతాం. ఆ నిస్సత్తువ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ‘స్లీప్ ఏప్నియా’ లక్షణాలే. ఇది చాలా తీవ్రమైన రుగ్మత. తరచూ శ్వాస ఆగి ఆగి కొనసాగుతూ ఇబ్బంది పెడుతుంది. నిద్రిస్తున్నప్పుడు పై వాయునాళం (అప్పర్ ఎయిర్వే) పదేపదే ఒత్తిడికి గురికావడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతారు నిపుణులు. అయితే, స్లీప్ ఏప్నియాను ఎవరూ ఒక రోగంగా గుర్తించడం లేదు. చికిత్స కోసం వైద్యుల దగ్గరికి కూడా వెళ్లడం లేదు. పెద్దల్లో 15 నుంచి 30 శాతం మందికి ఈ సమస్య ఉంటుందని ఓ అంచనా.
చికిత్స ఎందుకు?
స్లీప్ ఏప్నియాకు చికిత్స అందకపోతే ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పొద్దంతా మగతగా ఉండటం వల్ల రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరు. దీంతో పదోన్నతుల్లో వెనుకబడిపోతారు. కెరీర్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. వ్యాపారులైతే కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించలేరు. ఫలితంగా దీర్ఘకాలంలో నష్టాలపాలు అవుతారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇవన్నీ సామాజికమైన, మానసికమైన ఇబ్బందులు. ఇక శరీర వ్యవస్థ విషయానికొస్తే.. జీవక్రియ మందగిస్తుంది.
గుండె కవాటాలు, మెదడు కవాటాల వ్యాధులు ఇబ్బంది పెడతాయి. న్యూరోసైకియాట్రిక్ డిస్ఫంక్షన్, పల్మనరీ హైపర్టెన్షన్, టైప్-2 మధుమేహం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మొదలైన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి, స్లీప్ ఏప్నియాను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవాలి. వృద్ధాప్యం, ఊబకాయం ఈ సమస్యకు మూల కారణాలు. ముక్కు దిబ్బడ, ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్, కిడ్నీ వ్యాధులు, గుండె రుగ్మతలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్ మెలిటస్ లాంటివి కూడా స్లీప్ ఏప్నియాకు దారితీస్తాయి.
రోగ నిర్ధారణ ఇలా..
పాలిసోమ్నోగ్రఫీ (పీఎస్జీ)తో స్లీప్ ఏప్నియా నిర్ధారణ చేస్తారు. నిద్రలో శ్వాస సమస్యలను బట్టి స్లీప్ ఏప్నియా తీవ్రతను బేరీజు వేస్తారు. ఏప్నియా, హైపాప్నియా, రెరా (రెస్పిరేటరీ ఎఫర్ట్ రిలేటెడ్ అరౌజల్స్) ఉన్నాయేమో కూడా పరీక్షిస్తారు. సమస్య దశను బట్టి చికిత్స మొదలవుతుంది. బరువు తగ్గడం, నిత్య వ్యాయామం, నిద్ర విధానంలో మార్పులు, మద్యపానం, డ్రగ్స్ తదితర దురలవాట్లను దూరంపెట్టడం.. సమస్యను అధిగమించడంలో కొంతమేర సాయపడతాయి. రోగ లక్షణాలను బట్టి వైద్యులు మందులను సిఫారసు చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో పై వాయు నాళానికి శస్త్ర చికిత్స చేస్తారు.హాయిగా నిద్ర పోవాలంటే..సుఖవంతమైన నిద్రకు ఒకటే మార్గం. జీవన శైలిలో మార్పులు చేసుకోవడమే.
రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి, ఒకే సమయానికి మేల్కొనాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మసాలాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
విటమిన్లూ కీలకమే
విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల కూడా నిద్ర సంబంధమైన సమస్యలు రావచ్చు. కాబట్టి పోషకాహారంతో ఈ రుగ్మతను అధిగమించవచ్చు.
విటమిన్-డి
నిద్రలేమి, కలత నిద్ర, హఠాత్తుగా మెలకువ రావడం.. తదితర సమస్యలకు విటమిన్-డి లోపం ఓ కారణమని చెబుతారు. నిద్ర-మెలకువకు సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షించేందుకు.. మెదడులో ఓ ప్రత్యేకమైన విభాగం ఉంది. విటమిన్-డి ద్వారా దానికి పోషకాలు అందుతాయి. కాబట్టి, శరీరంలో విటమిన్-డి కొరత అధికమైన కొద్దీ నిద్రతో ముడిపడిన సమస్యలు పెరుగుతాయి. సాల్మన్ చేప, గుడ్డు సొన, చీజ్, పుట్టగొడుగులు, సముద్ర ఆహారంతో విటమిన్-డి నిల్వలను పెంచుకోవచ్చు.
విటమిన్-ఎ
నిద్రలేమికి, విటమిన్-ఎకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. కాబట్టి క్యారెట్, ఆప్రికాట్, టమాట తదితర పదార్థాలు తింటూ విటమిన్-ఎ లోటు పూడ్చుకోవాలి.
విటమిన్-బి12
నిద్రలేమి, నిస్సత్తువ అనేవి విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్న రోగులలో కనిపించే ప్రధాన లక్షణాలు. ఈ విటమిన్ లోపం వల్ల డిప్రెషన్కూ ఆస్కారం ఉంది. డిప్రెషన్ ప్రధాన లక్షణాల్లో ఒకటి.. నిద్రలేమి. మాంసాహారం, గుడ్లు, తక్కువ కొవ్వు కలిగిన పాలు, తృణధాన్యాలు బి-12ను సమృద్ధిగా అందిస్తాయి.
మరికొన్ని..
విటమిన్-బి9, విటమిన్-ఇ, విటమిన్-సి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిద్రతో ముడిపడి ఉంటాయి. బీ-కాంప్లెక్స్ విటమిన్లలో లభించే ఫోలిక్ యాసిడ్ లోపం నిద్రలేమికి దారి తీయవచ్చు. ఇక, విటమిన్-ఇ లోపం రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసి అంతిమంగా నిద్రనూ ప్రభావితం చేస్తుంది. విటమిన్-సి పుష్కలంగా లభించేవారికి నిద్రలేమి అన్నదే ఉండదు. మెగ్నీషియం కూడా కండరాలకు రిలాక్సేషన్ ఇచ్చి నిద్రాదేవతను ఆహ్వానిస్తుంది.
గాఢనిద్ర కాదు.. జబ్బు!
మా ఆయన వయసు నలభై ఎనిమిది.ఆరోగ్యంగానే ఉంటారు. కానీ నిద్రలో గురకపెట్టే అలవాటు తీవ్రంగా ఉంది. వింతవింత శబ్దాలు చేస్తుంటారు. ఈ మధ్య ఎక్కడో ‘గురక’ అనేది ఒక జబ్బు అనీ, చికిత్స తీసుకోకపోతే ప్రమాదమనీ చదివాను. అప్పట్నుంచి భయం పట్టుకున్నది. మా ఆయనకు ఎలాంటి చికిత్స చేయించాలి? అలాగే, ఆయన హాయిగా నిద్రపోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించండి.
పద్మావతి, కరీంనగర్
స్లీప్ ఏప్నియా వల్ల వచ్చే సున్నితమైన, ముఖ్యమైన సమస్య గురక. గురక పెట్టి నిద్ర పోతున్నారంటే గాఢనిద్రలో ఉన్నారనే అనుకుంటాం. నిజానికి గాఢనిద్ర కాదు గదా.. మామూలుగా కూడా వాళ్లు నిద్ర సుఖాన్ని అనుభవించలేరు. శ్వాస సరిగా అందక ఇబ్బంది పడుతుంటారు. బాగా అలసిపోయి, నిద్రపోతున్నారని అనుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. స్లీప్ ఏప్నియా శారీరక సమస్యలనే కాకుండా మానసిక, సామాజిక సమస్యలను కూడా తీసుకొస్తుంది. గురకను తీవ్రమైన జబ్బుగానే పరిగణించాలి. ఇతర సమస్యలు లేనప్పుడు, గురక తాత్కాలికంగా ఉంటుంది. కానీ స్లీప్ ఏప్నియా వల్ల దీర్ఘకాలం వెంటాడుతుంది. నిద్రలో సగానికి సగం సమయం గురక పెట్టే వాళ్లకు గుండె జబ్బులు దరిచేరే ఆస్కారం మరింత ఎక్కువ. గురకతోపాటుగా బీపీ, మధుమేహం, ఊబకాయం కూడా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి.
లక్షణాలు
-డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ సీనియర్ ఇంటర్వెన్షనల్
పల్మనాలజిస్ట్ & స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్పేట్, హైదరాబాద్