Health News | మీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే మీకూ ఆ సమస్య తలెత్తడానికి ఆస్కారం ఉందట. చాలామంది దంపతులు ఒకేరకమైన ఆసక్తులు, జీవించే వాతావరణం, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులను కలిగి ఉంటారు.
వీటిలో అధిక రక్తపోటు ఒకటి అంటారు అట్లాంటాలో ఎమరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చి సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేసే జితిన్ సామ్ వర్గీస్. కాగా పరిశోధకులు… అమెరికా, ఇంగ్లండ్, చైనా, భారతదేశాలకు చెందిన వేలాది దంపతుల నుంచి సేకరించిన ఆరోగ్య సమాచారం నుంచి ఈ రకమైన నిర్ధారణకు వచ్చారు. కాబట్టి రక్తపోటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండేలా శ్రద్ధచూపాలని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం సూచించింది.
ఒత్తిడి తిండితో ఊబకాయం
మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా తింటే అంతగా రుచించదట. దీంతో మన నాలుక సంతృప్తి చెందేవరకు ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుందట. ఇలా తింటూపోతే బరువు పెరిగిపోతాం. అలా మన అధిక బరువుకు ఒత్తిడి కూడా కారణం అవుతుందన్నమాట. దీని గురించి ‘ఫిజియాలజీ అండ్ బిహేవియర్’ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. దీనికోసం పరిశోధకులు 76 మందిని ఎంచుకున్నారు. వీరిని తక్కువ ఒత్తిడి, ఎక్కువ ఒత్తిడి వర్గాలుగా విభజించారు.
వారికి తియ్యగా ఉండేది, కారంగా ఉండే రెండు రకాల సూప్‌లను ఇచ్చారు. ఎంత కావాలనుకుంటే అంతగా సూప్ తాగమని సూచించారు. ఇందులో ఎక్కువ ఒత్తిడితో ఉన్నవాళ్లు… తక్కువ ఒత్తిడి ఉన్నవాళ్లతో పోలిస్తే ఏ సూప్తోనూ సంతృప్తి చెందలేదట. అంతేకాదు సూప్ తాగిన పరిమాణంలోనూ రెండు వర్గాలకు చాలా తేడా గమనించారు పరిశోధకులు. కాబట్టి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరికను కొంచెం ఆపుకోవడం మంచిది.