Health Tips | పార్కిన్సన్స్ను ఇలా అడ్డుకోవచ్చు
సైక్లింగ్, వాకింగ్, తోటపని, ఇంటిపని, ఆటలు.. ఇలా శారీరక వ్యాయామంతో ముడిపడిన వ్యాపకాల్లో నిమగ్నమయ్యే మహిళలకు పార్కిన్సన్స్ వ్యాధి ముప్పు 25 శాతం తక్కువని ఓ అధ్యయనం వెల్లడించింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్లో ఇది ప్రచురితమైంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు అత్యంత చవకైన మార్గం వ్యాయామమే అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మందులు లేని మొండి వ్యాధి పార్కిన్సన్స్ ముదిరిపోకుండా వ్యాయామం అడ్డుకుంటుందని కూడా హామీ ఇస్తున్నది.
బైపోలార్ డిసీజ్.. జాగ్రత్త!
20 ఏండ్లలోపే పెండ్లి చేసుకున్న దంపతులకు జన్మించిన పిల్లలకు.. బైపోలార్ డిజార్డర్ వచ్చే ముప్పు ఎక్కువట. ఇది మానసిక సమస్య. ఈ రుగ్మత ఉన్నవాళ్లకు ఉద్వేగాల మీద నియంత్రణ ఉండదు. అతిగా స్పందించడమో (హైపర్మేనియా), అతి తక్కువగా స్పందించడమో (కుంగుబాటు లక్షణం) చేస్తారు. హైపర్మేనియాలోకి వెళ్లినప్పుడు తమంతటి వారు లేరనే భావనతో ఉంటారు. కుంగుబాటుకు లోనైనప్పుడు తాము ఎందుకూ పనికిరామనే ఆలోచన వేధిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని యూరోపియన్ న్యూరోసైకోఫార్మకాలజీ వెల్లడించింది.
నిద్రా జాడ్యానికి పాటల మందు
బద్ధకంగా నిద్ర లేస్తున్నారా? అయితే మీలో నిద్రా జాడ్యం సమస్య ఉన్నట్టే. నిద్రా జాడ్యం (స్లీపింగ్ ఇనెర్షియా) 30 నిమిషాల నుంచి 4 గంటల పాటు ఉంటుంది. ఇది మెదడు మీద, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీద, మనం ప్రతిస్పందించే సమయాల మీద దుష్ప్రభావం చూపుతుంది. దీన్నుంచి బయటపడేందుకు మనకు ఇష్టమైన పాటను అలారం అలర్ట్గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. ఈ అధ్యయనం కోసం.. తాము ఎంచుకున్న వారి స్మార్ట్ఫోన్లలో వారికి ఇష్టమైన పాటలు వినిపించేలా ఓ యాప్ జోడించారు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో కొంతమందిని మామూలు అలారం పెట్టుకోమని, మిగిలిన వారిని నచ్చిన పాటను అలర్ట్గా ఉంచుకోమని సూచించారు. ఈ రెండు బృందాలవారు కూడా.. అలారం రాగానే స్మార్ట్ఫోన్ తెర తాకాలని చెప్పారు. మామూలు అలారంతో పోలిస్తే, తమకు నచ్చిన పాటలు విన్నవారు ఈ లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తిచేశారట. ఠక్కున స్మార్ట్ఫోన్ స్క్రీన్ తాకారట. కాబట్టి, నిద్రా జాడ్యాన్ని వదిలించుకోవడానికి మీకు మనసైన పాటలతో మేల్కొలుపు సిద్ధం చేసుకోండి.