ఏ ఉద్యోగమైనా వారంలో కనీసం 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారంలో నాలుగు రోజులు, రోజుకు 8 గంటల చొప్పున 32 గంటలే పనిచేస్తే? అదే పనితనాన్ని కనబరుస్తూ.. అదే వేతనం అందుకుంటే ఎలా ఉంటుంది? అనే అంశంపై అరవై బ్రిటిష్ కంపెనీలు ఆరు నెలలపాటు అధ్యయనం చేశాయి. దీనికోసం మూడు వేల మంది ఉద్యోగులను వారంలో నాలుగురోజులు, రోజుకు 8 గంటల పనికి ఒప్పించాయి. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ విధానంలో చాలామంది ఉద్యోగులు కార్యాలయాల్లో సొంత పనులు చేసుకోకుండా విధుల మీదే దృష్టి పెట్టారని తేలింది. అంతేకాదు.. ఆరోగ్యంగా, ఆనందంగా కూడా ఉన్నారట. అదీ తక్కువ ఒత్తిడి, తక్కువ అలసటతో. పైగా మూడు రోజులు సెలవులు ఉండటంతో శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడిందట. అంతేకాదు, ఈ విధానం సంస్థలకూ ప్రయోజనకరమని వెల్లడైంది.
ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండేవాళ్లు హారన్లు, ఇంజన్ల రణగొణ ధ్వనులు, అంబులెన్సులు, ఇతర వాహనాల మోత భరించడం తప్పనిసరి. పరిమితికి మించిన శబ్దాలను ‘ధ్వని కాలుష్యం’ అంటారు. ఇది చెవులకు నొప్పి కలిగించే సమస్య మాత్రమే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. యూనివర్సిటీ ఆఫ్ లీస్స్టర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, పెకింగ్ యూనివర్సిటీల ఉమ్మడి అధ్యయనంలో ధ్వని కాలుష్యం అధిక రక్తపోటు ముప్పును పెంచుతుందని నిర్ధారణ అయ్యింది. తమ అధ్యయనం కోసం పరిశోధకులు ఇండ్లను గాలి కాలుష్యం, ధ్వని కాలుష్యం కోణంలో వర్గీకరించి పరిశోధన చేశారు. క్రమం తప్పకుండా ఎక్కువ స్థాయి ధ్వని కాలుష్యానికి లోనైనవాళ్లలో అధిక రక్తపోటు ముప్పు ఎక్కువని తేల్చారు. కాబట్టి, తక్కువ శబ్దం చేసే వాహనాలను రూపొందించడం, రోడ్ల వెంబడి అవసరమైతే తప్ప హారన్లు, సైరన్లు మోగించకపోవడం, శబ్ద నిరోధకాలు ఏర్పాటు చేయడం, నిశ్శబ్ద ప్రాంతాలుగా ప్రకటించడం.. మొదలైన చర్యల ద్వారా ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందిలో నిర్ధారణ అవుతున్న మతిమరుపు వ్యాధి.. పార్కిన్సన్స్. ఇప్పటివరకు పార్కిన్సన్స్ లక్షణాలు కనిపించిన తర్వాతే వ్యాధి నిర్ధారణ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు లక్షణాలు బయల్పడక ముందే రక్త పరీక్షతోనే పార్కిన్సన్ను కనిపెట్టవచ్చని తేలింది. అలా మతిమరుపు ముప్పునూ తప్పించుకోవచ్చు. ఈ సాంకేతికతను అమెరికాకు చెందిన డ్యూక్
యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.