Mutton | మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన నాన్ వెజ్ ప్రియులు మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మేక మాంసం అంటే చాలా మందికి ఇష్టమే. మన దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన వారు ఏ శుభకార్యం జరిగినా సరే మటన్ కచ్చితంగా పెడతారు. అందులో తెలంగాణ అగ్ర స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అయితే మటన్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు మటన్‌లో ఉంటాయి. మటన్‌లో మన శరీరానికి అవసరం అయ్యే 9 రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మత్తులకు ఎంతగానో దోహదం చేస్తాయి. వీటి వల్ల శరీరం తనకు తాను సులభంగా మరమ్మత్తులు చేసుకుంటుంది. అలాగే మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను సైతం శరీరం సులభంగా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది.
మటన్‌లో అనేక మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మటన్‌లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. మటన్‌లోని సెలీనియం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తుంది. థైరాయిడ్ కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. మటన్‌లో అధికంగా ఉండే ఫాస్ఫరస్ ఎముకలు, దంతాలకు బలాన్నిస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మటన్ లో అనేక రకాల బి విటమిన్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. విటమిన్ బి12 లోపం ఉన్నవారు తరచూ మటన్‌ను తింటుంటే ఈ లోపం తగ్గుతుంది. విటమిన్ బి12 వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మెడ, భుజాల నొప్పులు తగ్గుతాయి. ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
మటన్‌లో విటమిన్లు బి3, బి2 అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. మెటబాలిజం మెరుగు పడేలా చేస్తాయి. దీంతో శరీరం శక్తిని సరిగ్గా వినియోగించుకుంటుంది. నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. మటన్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసేవారికి ఎంతో మేలు జరుగుతుంది. వారు కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి కూడా మటన్‌లో ఉండే ప్రోటీన్లు మేలు చేస్తాయి. మటన్‌ను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
మటన్ ఆరోగ్యకరమే అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అధికంగా తింటే దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మటన్‌ను వారానికి 100 గ్రాముల వరకు తినవచ్చు. అదే శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు అయితే 200 గ్రాముల వరకు తినవచ్చు. అంతకు మించి తినకూడదు. మటన్‌ను అధికంగా తింటే పలు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మటన్‌ను అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె పోటుకు దారి తీయవచ్చు. అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగి గౌట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో కీళ్లలో స్ఫటికాలు ఏర్పడి తీవ్రమైన వాపులు, నొప్పులు కలుగుతాయి. మటన్‌లో కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కనుక దీన్ని అతిగా తింటే సరిగ్గా జీర్ణం కాక అజీర్తి, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మటన్‌ను మోతాదులోనే తినాలి. జాగ్రత్తలను పాటిస్తూ దీన్ని తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.