Mutton Bone Soup | ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసాహార ప్రియులు ఏ వంటకాన్ని ఆస్వాదిద్దాం.. అని ఎదురు చూస్తుంటారు. కొందరు చికెన్‌ను ఇష్టంగా తింటే, కొందరు మటన్‌ను ప్రీతికరంగా లాగించేస్తారు. ఇలా ఒక్కొక్కరికి భిన్నమైన రుచి ఉంటుంది. అయితే మాంసాహారాల్లో మటన్ బోన్ సూప్ అత్యంత ఆరోగ్యకరమైనది అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంప్రదాయ వైద్య విధానాల్లో మటన్ బోన్ సూప్‌ను ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. చాలా మంది మటన్ బోన్ సూప్‌ను ఇష్టంగా తాగుతుంటారు. దీన్ని రోటీలు లేదా బ్రెడ్‌తో తింటారు. ఎంతో రుచిగా ఉంటుంది. మటన్ బోన్ సూప్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మటన్ బోన్ సూప్‌ను తరచూ తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఈ సూప్ పలు వ్యాధులను నయం చేయడంలోనూ ఎంతగానో సహాయం చేస్తుంది.
మటన్ బోన్ సూప్‌ను తాగడం వల్ల కొల్లాజెన్, గెలాటిన్ అధికంగా లభిస్తాయి. ఇవి ఎముక మజ్జ తయారయ్యేందుకు సహాయం చేస్తాయి. కనుకనే ఎముకలు విరిగిన వారికి మటన్ బోన్ సూప్‌ను ఇస్తుంటారు. దీంతో ఎముకలు త్వరగా నిర్మాణమవుతాయి. ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు బలంగా కూడా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు విరగకపోయినా మటన్ బోన్ సూప్‌ను తరచూ సేవిస్తుంటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. మటన్ బోన్ సూప్‌ను తాగితే జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్‌ను తగ్గించుకోవచ్చు. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
మటన్ బోన్ సూప్‌ను తాగడం వల్ల అనేక మినరల్స్ లభిస్తాయి. క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ ను అధికంగా పొందవచ్చు. ఇవి ఎముకల నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి సహాయం చేస్తాయి. దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మటన్ బోన్ సూప్‌ను తాగితే గ్లైసీన్ అనే అమైనో యాసిడ్ అధికంగా లభిస్తుంది. అలాగే ప్రోలీన్ అనే అమైనో ఆమ్లాన్ని కూడా పొందవచ్చు. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ తగ్గిపోతాయి. ఆస్తమా ఉన్నవారికి మేలు జరుగుతుంది.
మటన్ బోన్ సూప్‌లో ఉండే కొల్లాజెన్ చర్మం, శిరోజాలు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూప్‌ను తరచూ సేవిస్తుంటే చర్మం తన సాగే గుణాన్ని పొందుతుంది. చర్మం తేమగా కూడా ఉంటుంది. దీని వల్ల చర్మం, ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గోర్లు చిట్లిపోకుండా ఉంటాయి. మటన్ బోన్ సూప్‌లో ఉండే గ్లైసీన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. ఇలా మటన్ బోన్ సూప్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.