చిన్నచిన్నగా ఉండే రేగుపండ్లు.. శరీరానికి గొప్ప మేలుచేస్తాయి. శీతాకాలంలో ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలను దూరంచేస్తాయి.
చిన్నచిన్నగా ఉండే రేగుపండ్లు.. శరీరానికి గొప్ప మేలుచేస్తాయి. శీతాకాలంలో ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలను దూరంచేస్తాయి. రోగనిరోధకశక్తి పెంచడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
మనిషి శరీరానికి కావాల్సిన 24 రకాల అమైనో ఆమ్లాలలో.. 18 రకాలు రేగుపండ్లలోనే లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కిస్తాయని చెబుతున్నారు.
రేగుపండ్లలో విటమిన్-సి పుష్కలంగా దొరుకుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా.. చలికాలంలో వేధించే జలుబు, దగ్గుతోపాటు ఫ్లూ, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఇక చలికాలంలో ఎక్కువగా వేధించే కీళ్లనొప్పుల నుంచీ.. రేగుపండ్లు ఉపశమనం కలిగిస్తాయి.
ఎండబెట్టిన రేగు పండ్లలో కాల్షియం, భాస్వరం ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో సాయపడతాయి. ఎముకల్ని బలహీనపరిచే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి.. ఈపండ్లు మంచి ఎంపిక.
వీటిలో లభించే ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ లాంటి యాంటి ఆక్సిడెంట్లు.. ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి.
చిన్న రేగుపండ్లలో పొటాషియం, భాస్వరం, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.
రేగుపండ్ల తొక్కలో కాలేయానికి మేలుచేసే సుగుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే.. కాలేయం పనితీరు మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది కూడా.
రేగుపండ్లలో అధికంగా లభించే ఫైబర్.. జీర్ణాశయం గోడల్ని సంరక్షిస్తుంది. హానికర బ్యాక్టీరియాతోపాటు అల్సర్ల నుంచీ కాపాడుతుంది. సహజ ప్రొబయోటిక్గా పనిచేసి.. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చూస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది.
ఆకలిని నియంత్రించడంలో రేగుపండ్లు సమర్థంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తమ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు అందుతాయి.