చేస్తున్న పని అలసిపోకుండా, పెద్దగా శ్రమపడకుండానే పూర్తవుతుందంటే దాన్ని ‘నల్లేరు మీద నడక’ అంటారు. ఈ మాట ఎందుకు పుట్టిందంటే?… ఒకప్పుడు సుఖమైన, కుదుపులు లేని ప్రయాణం కోసం బండి చక్రాల ముందు నల్లేరు కాడలు చల్లేవారు. ఈ కాడలు చతురస్రాకారంలో ఉంటాయి. ఇవి బండి చక్రాల కింద నలగడం వల్ల కుదుపులు ఉండవు. అందుకే అనుకూలమైన, సౌకర్యవంతమైన పనిని నల్లేరు మీద నడక అంటారు.
నల్లేరును ‘వజ్రవల్లి’ అని కూడా పిలుస్తారు. ఇది విరిగిన ఎముకలను అతికిస్తుందని, ఎముకలను దృఢపరుస్తుందనీ అంటారు. అందుకే దీనిని ‘అస్తి సంహారక’ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, దగ్గు, కోరింత దగ్గు శ్లేష్మాన్ని తగ్గించడానికి వాడతారు. కేరళ ఆయుర్వేద వైద్యంలో నల్లేరు కాడ గుజ్జుతో వైద్యం చేస్తారు.
రక్తాన్ని శుద్ధిచేసి, క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. మోకాళ్ల నొప్పులకూ దివ్యమైన ఔషధం. విటమిన్ డి, కెరాటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, సెలీనియం వంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. మన చుట్టూ అనేక ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ప్రకృతిలో ఉన్నాయి. కానీ, మన అజ్ఞానం వల్ల వాటి విలువను తెలుసుకోలేక పోతున్నాం. ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు కార్పొరేట్ హాస్పిటల్కి పరుగెత్తే బదులు ప్రకృతి ప్రసాదించిన వరం లాంటి మొక్కలు అనేకం ఉన్నాయి. వాటిలో నల్లేరు ఒకటి.
నల్లేరు తీగజాతి మొక్క. ఇది నులి తీగల సహాయంతో ఆధారానికి ఎగబాకుతుంది. తెలుగు రాష్ర్టాల్లో సులువుగా పెరుగుతుంది. మన దేశంతోపాటు ఆగ్నేయాసియా దేశాలన్నిటిలోనూ నల్లేరు కనిపిస్తుంది. కాండం చతురస్ర ఆకారంలో, అనేక కణుపులు కలిగి పొడవుగా పెరుగుతుంది. అందువల్ల తీగలా కనిపిస్తుంది. కాయలు బఠాణీ గింజల్లా పచ్చగా కాసి, ఎర్రగా పండుతాయి. గ్రామీణులు ఈ మొక్కతో పచ్చడి, కూరలు చేసుకుంటారు. ఎండబెట్టి, పొడిచేసి, కూరల్లో కూడా వేస్తారు. నల్లేరు మొక్కకు చావు లేదు. గాలినే ఆహారంగా తీసుకుని పెరుగుతుంది.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు