మా పిల్లవాడి వయసు ఏడు సంవత్సరాలు. బాగా అల్లరి చేస్తాడు. బడి నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. పలుమార్లు దెబ్బలు తగిలించుకుంటాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. కొన్ని సందర్భాల్లో చేయిచేసుకుంటే కానీ ఆగడు. ఏం చేయాలో సలహా ఇవ్వండి.
Parenting | పిల్లలు అంటేనే అల్లరి. మీరు చెప్పేదాన్ని బట్టి మీ పిల్లవాడు చేసే అల్లరి అదుపు తప్పిందనిపిస్తున్నది. మీ మాటల ఆధారంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) లక్షణాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఈ రుగ్మత ఉన్న పిల్లలు నిలకడగా పనిచేయరు. ఒక పని కొంచెం చేయగానే మరో పని చేయాలనుకుంటారు. దేనిమీదా ఏకాగ్రత ఉండదు. ఇంపల్సిటివిటీ (హఠాత్తుగా చేయడం), హైపర్ యాక్టివిటీ (అధిక చురుకుదనం), ఇన్అటెంటివ్నెస్ (అజాగ్రత్తగా ఉండడం) ఏడీహెచ్డీ ప్రధాన లక్షణాలు. ఏడీహెచ్డీ ఉంటే తరగతి గదిలో ఇతరులకు అసౌకర్యం కలిగిస్తారు. దాంతో టీచర్లకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్నాయా? అవి ఏడీహెచ్డీ లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయా తేల్చాలంటే మొదటగా పిల్లల వైద్యులకు చూపించాలి.
ఏడీహెచ్డీ నిర్ధారించడానికి కొన్ని ప్రమాణాలు పాటిస్తారు. కొన్ని లక్షణాలు ఉన్నంత మాత్రాన ఏడీహెచ్డీ ఉన్నట్టు కాదు. డిస్లెక్సియా (నేర్చుకోవడంలో ఇబ్బంది), థైరాయిడ్, మరికొన్ని రకాల వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీ అబ్బాయి సమస్య ఏడీహెచ్డీ వల్లనా, మరేదైనా అయ్యుంటుందా? అనేది మొదటగా నిర్ధారించాలి. దీనికంటే ముందుగా మీ పిల్లవాడిని సురక్షితమైన ప్రదేశంలోనే ఉంచాలి. వాళ్ల చర్యల వల్ల గాయపడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇతర పిల్లలతో తీవ్రంగా గొడవపడతారు. గాయపరుస్తారు. కాబట్టి టీచర్లకు, తోటి విద్యార్థులకు కూడా విషయాన్ని అర్థమయ్యేలా ముందే చెప్పాలి. డాక్టర్ చెప్పిన పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణ, సరైన వైద్యం చేయిస్తే ఏడీహెచ్డీని అదుపు చేయవచ్చు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్