Hair Growth Foods | ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కాలుష్య భరిత వాతావరణంలో నివసించడం, నీటి కాలుష్యం, నీటి ప్రభావం, ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, థైరాయిడ్ వంటి కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక కాలుష్య భరితమైన వాతావరణంలో ఉండే వారిని చుండ్రు ఇబ్బందులకు గురి చేస్తోంది. చలికాలంలో జుట్టు సమస్యలు చాలా మందికి మరింత ఎక్కువవుతుంటాయి. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే పలు పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించే చిట్కాలను పాటించడంతోపాటు ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి.
మనకు నువ్వులు అందుబాటులోనే ఉంటాయి. వీటిల్లో రెండు రకాల నువ్వులు ఉంటాయి. అయితే తెల్ల నువ్వులను మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఈ నువ్వులను కాస్త వేయించి రోజూ నేరుగా లేదా బెల్లంతో కలిపి తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా నువ్వుల్లో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు, మినరల్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. కనుక రోజువారి ఆహారంలో నువ్వులను చేర్చుకోవాలి. అలాగే జుట్టు రాలే సమస్య నుంచి బయట పడేందుకు గాను పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీంతో కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. అలాగే ఈ విత్తనాల్లో జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవన్నీ శిరోజాలను సంరక్షిస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తాయి. పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా కాస్త వేయించి రోజూ తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది.
అవిసె గింజలు కూడా జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఈ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. అలాగే మెగ్నిషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా అవిసె గింజల్లో ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అవిసె గింజలను రోజూ వేయించి తింటుంటే మంచి ఫలితం ఉంటుంది. శిరోజాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తాయి. దీంతో జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు పెరిగేందుకు గాను గుమ్మడికాయ విత్తనాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వేయించిన గుమ్మడికాయ విత్తనాలను తింటుంటే ఫలితం ఉంటుంది. ఈ విత్తనాల్లో సెలీనియం, జింక్, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్ అధికంగా ఉంటాయి. అందువల్ల శిరోజాలకు పోషణ లభిస్తుంది. జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. అలాగే చియా విత్తనాలను తీసుకుంటున్నా కూడా జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ విత్తనాల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు ఎంతో దోహదం చేస్తాయి.
మెంతులను రోజూ ఆహారంలో భాగం చేసుకున్నా కూడా శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. రాత్రి పూట కొన్ని మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని తినాలి. ఇలా రోజూ తింటుంటే ఎంతో ఫలితం ఉంటుంది. మెంతుల్లో ప్రోటీన్లు, నియాసిన్, అమైనో ఆమ్ఆలు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయి. మెంతులను తింటే కొందరికి వికారంగా అనిపిస్తుంది. అలాంటి వారు మెంతులను నేరుగా పేస్ట్‌లా చేసి అందులో కాస్త పెరుగు కలిపి జుట్టుకు పట్టించవచ్చు. కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. శిరోజాలు ఒత్తుగా పెరగడమే కాదు, కాంతివంతంగా కూడా మారుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.