Hair Fall Reasons | జుట్టు రాలడం అన్నది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. రోజూ జుట్టు రాలుతూ ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆందోళన చెందుతున్నారు. అయితే జుట్టు రాలిపోయేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇందుకు స్త్రీలు, పురుషుల్లో దాదాపుగా ఒకే రకమైన కారణాలు ఉంటాయని చెప్పవచ్చు. హార్మోన్ల సమస్యలు, పోషకాహార లోపంతోపాటు కాలుష్యం, నీటి ప్రభావం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం వంటి వాటిని జుట్టు రాలిపోయేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే పలు ఇతర కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుంటుంది. ముఖ్యంగా ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ల లోపం ఉంటే జుట్టుకు సరిగ్గా పోషణ లభించదు. దీంతో జుట్టు కుదుళ్లు బలహీనంగా మారుతాయి. ఫలితంగా జుట్టు రాలుతుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఉంటుంది.
కొందరు అవసరం అయిన దానికన్నా ఎక్కువగా తలస్నానం చేస్తుంటారు. కొందరు రోజూ తలస్నానం చేస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయకూడదు. రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లు పొడిగా మారి విరిగిపోతాయి. దీంతో జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. అదేవిధంగా కొందరు కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్‌ను రెగ్యులర్‌గా వాడుతుంటారు. ముఖ్యంగా హెయిర్ డై, బ్లీచ్, స్టైలింగ్ ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే వీటిల్లో ఉండే కెమికల్స్ కారణంగా జుట్టుకు హాని జరుగుతుంది. ఫలితంగా జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. కనుక ఏ ప్రొడక్ట్ ను పడితే దాన్ని వాడకూడదు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి.
అదేవిధంగా కొందరు జుట్టును గట్టిగా బంధించి ఉంచే విధంగా స్టైల్ చేస్తుంటారు. దీంతో జుట్టుకు పోషణ లభించదు. తలలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీని వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కనుక జుట్టును మరీ గట్టిగా బంధించకూడదు. వదులుగా ఉండేలా జుట్టును స్టైల్ చేసుకోవాలి. అలాగే చాలా మంది హెయిర్ డ్రయర్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీంతో త్వరగా జుట్టును తడి ఆరబెట్టుకోవచ్చు. కానీ దీర్ఘకాలంగా వీటిని ఉపయోగించడం అంత మంచిది కాదు. వీటి వాడకం వల్ల జుట్టు పొడిబారిపోతుంది. జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు రాలుతుంది. కాబట్టి హెయిర్ డ్రయర్ లాంటి ప్రొడక్ట్స్ వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నా కూడా జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. కనుక ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నిత్యం మనం చాలా సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాం. అయితే రోజూ కాసేపు యోగా లేదా మెడిటేషన్ చేయడం, ఇష్టమైన సంగీతం వినడం, కంప్యూటర్ గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడం, హాస్య సన్నివేశాలను తిలకించడం, ప్రకృతిలో కాసేపు గడపడం, పుస్తకాలను చదవడం వంటి పనులు చేయాలి. దీంతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. దీని వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు రకాల సూచనలు పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాంతివంతంగా మారుతాయి. ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.