Ghee | నెయ్యిని మనం తరచూ పలు వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. బిర్యానీలతోపాటు మసాలా వంటకాలను చేసేందుకు కూడా నెయ్యిని వాడుతారు. నెయ్యిని వాడితే వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మన పెద్దలు కూడా చిన్నారులకు నెయ్యిని రోజూ తినిపించాలని చెబుతుంటారు. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం నెయ్యి మనకు ఎంతగానో మేలు చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ నెయ్యిని తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. నెయ్యిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభించడంతోపాటు ఎన్నో లాభాలు ఉంటాయని వారు అంటున్నారు.
నెయ్యిలో బ్యుటీరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్ జాబితాకు చెందుతుంది. ఇది జీర్ణాశయంతోపాటు పేగుల పొరలను సురక్షితంగా ఉంచుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. కనుక నెయ్యిని ఖాళీ కడుపుతో తినాల్సి ఉంటుంది. దీంతో జీర్ణాశయం, పేగుల గోడలకు నెయ్యి చేరి ఆ పొరలను రక్షిస్తుంది. దీని వల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. మలబద్దకం తగ్గుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఆయుర్వేదంలో నెయ్యిని వ్యర్థాలను బయటకు పంపే ఔషధంగా పరిగణిస్తారు. ఇది శరీరంలో ఉండే ఆమంను తొలగిస్తుంది. ఆమం అంటే శరీరంలోని వ్యర్థాలు. నెయ్యిని తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే ఆమం మొత్తం పోతుంది. దీంతోపాటు కొవ్వులు, ఇతర వ్యర్థాలు కూడా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. శరీరం డిటాక్స్ అవుతుంది. అంతర్గతంగా శుభ్రమవుతుంది. దీంతో రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు.
నెయ్యిలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు (ఎంసీటీ) కూడా అధికంగానే ఉంటాయి. అలాగే నెయ్యిలో లారిక్ యాసిడ్, లినోలియిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. సాధారణంగా నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందని, అధికంగా బరువు పెరుగుతారని భావిస్తారు. కానీ నెయ్యిలో ఉండే ఎంసీటీలు మెటబాలిజంను పెంచుతాయి. కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో బరువు సైతం తగ్గుతారు. అలాగే శరీరంలో రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా, చురుగ్గా పనిచేస్తారు. అలసట, నీరసం అనేవి ఉండవు. బద్దకం పోతుంది. చిన్నారులకు నెయ్యిని తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుంది. చదువులతోపాటు అన్ని యాక్టివిటీలలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. తెలివితేటలు పెరుగుతాయి.
నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లయిన ఎ, డి, ఇ, కె ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి లభిస్తాయి. ఇవి శిరోజాలతోపాటు చర్మాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల చర్మానికి సహజసిద్ధంగా తేమ లభిస్తుంది. దీంతో చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. చర్మం సహజసిద్ధంగా కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే జుట్టు రాలడం తగ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. జుట్టు కుదుళ్లు కూడా దృఢంగా మారుతాయి. ఆయుర్వేద ప్రకారం నెయ్యిని మేథ్య రసాయనగా చెబుతారు. అంటే నెయ్యిని తినడం వల్ల మెదడు ఉత్తేజంగా మారుతుందని అర్థం. ఇది బ్రెయిన్‌కు సహజసిద్ధమైన టానిక్‌లా పనిచేస్తుంది. దీంతో నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. ఇలా నెయ్యిని రోజూ పరగడుపునే తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.