Ghee For Skin Health | నెయ్యిని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని నేరుగా తింటారు లేదా వంటల్లో వేస్తారు. నెయ్యిని కలిపి అన్నంతోపాటు తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఉత్తరాది వారు నెయ్యిని చపాతీలపై రాసి కూడా తింటారు. నెయ్యితో చాలా మంది ఎక్కువగా తీపి వంటకాలను చేస్తుంటారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప్రకారం నెయ్యి మనకు అనేక లాభాలను అందిస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. శరీరాన్ని సంరక్షిస్తాయి. అయితే ఆరోగ్యపరంగానే కాక సౌందర్య పరంగా కూడా నెయ్యి మనకు అనేక లాభాలను అందిస్తుంది. నెయ్యిని పలు విధాలుగా ఉపయోగించడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది.
కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను తొలగించేందుకు గాను నెయ్యి అద్బుతంగా పనిచేస్తుంది. ఇందుకు ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యిని తీసుకుని రాత్రి పూట నిద్రించే ముందు నల్లని వలయాలపై నెమ్మదిగా రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. అయితే రాత్రి పూట వద్దనుకునేవారు ఉదయం కూడా రాయవచ్చు. రాసిన తరువాత 2 నుంచి 3 గంటలపాటు వేచి ఉండాలి. తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. చలికాలంలో పెదవులు సహజంగానే పగులుతుంటాయి. అయితే కొందరికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి వారు రాత్రి పూట పెదవులకు కొద్దిగా నెయ్యి రాస్తే మేలు జరుగుతుంది. రాత్రి పూట పెదవులకు నెయ్యి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుండడం వల్ల పెదవులు పగలడం తగ్గుతుంది. పెదవులు మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తాయి. పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి.
స్నానం చేయడానికి ముందు కొద్దిగా నెయ్యిని శరీరానికి లేదా ముఖానికి రాయాలి. కాసేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చర్మం తేమగా మారి మృదువుగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. పొడిబారిన చర్మం ఉన్నవారికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కొద్దిగా నెయ్యి తీసుకుని అందులో కాస్త శనగపిండి, పాలు వేసి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుండడం వల్ల ముఖంలో కళ పెరుగుతుంది. కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
గాయాలు, పుండ్లను తగ్గించేందుకు కూడా నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పూట గాయాలు, పుండ్లపై కాస్త నెయ్యి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే అవి త్వరగా మానుతాయి. ఇన్ఫెక్షన్ అవకుండా ఉంటాయి. అలాగే నెయ్యిని, తేనెను కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి రాయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా నెయ్యిని ఉపయోగించడం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.