హైదరాబాద్, జూన్ 07 : ఆయన స్వస్థలం కాకినాడ. 60 ఏళ్ల వయసున్న ఉదయ్.. 20 ఏళ్లకుపైగా ఆఫ్రికా ఖండంలోని ఘానా దేశంలో 20 ఏళ్లకుపైగా వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. అక్కడ ఉండగా తీవ్రంగా ఫాల్సిపారం మలేరియా బారినపడ్డారు. ఆ తర్వాత సెప్సిస్ సమస్య వచ్చింది. దాంతోపాటు ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) కూడా రావడంతో.. ఆయనకు అస్సలు ఊపిరి కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఆయన కోలుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి వైద్యులు కిమ్స్ కొండాపూర్ వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు అక్కడే ముందుగా వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పుడు ప్రత్యేక విమానంలో కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంక్లిష్టమైన మిషన్‌ను డాక్టర్ డీవీ రామకృష్ణ, మెడికల్ ఆపరేషన్స్ బృందం అత్యుత్తమ సమన్వయంతో ప్లాన్ చేసి అమలు చేశారు.
ఆయనను పరీక్షించి వెంటనే చికిత్స ప్రారంభించి ప్రాణాలు కాపాడిన ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రవిశేఖర్ రెడ్డి, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ తదితరులు ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకి వివరించారు. ‘ఆఫ్రికా ఖండంలోని ఘానా దేశంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను చార్టర్డ్ విమానంలో అక్కడి కిమ్స్‌కు తీసుకువచ్చాం. ఇందుకు ఏకంగా 16 గంటల వరకు సమయం పట్టింది. అంతసేపు రోగి 35వేల అడుగల ఎత్తున కూడా వెంటిలేటర్ మీదే ఉన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆసుపత్రికి చెందిన దాదాపు అన్ని వైద్య విభాగాల నిపుణులు కలిసి ఆయనకు చికిత్స ప్రారంభించి ఆయనను కంటికి రెప్పలా కాపాడారు. ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రిటికల్ కేర్ చికిత్సలు 24రోజుల పాటు అందించారు’ అని డాక్టర్ రవిశేఖర్ రెడ్డి వివరించారు.
అద్భుతమైన వైద్యం అంటే కేవలం విజ్ఞానం ఉంటే సరిపోదని.. తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు కూడా, ఏమాత్రం ఊహించలేని పరిస్థితులతో సరిహద్దులతో సంబంధం లేకుండా దాన్ని ఉపయోగించగలగాలని డాక్టర్ సుధీర్ విన్నమాల పేర్కొన్నారు. ఈ మిషన్‌కు 48 గంటల ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన క్లినికల్ సమన్వయం, తీవ్ర ఒత్తిడిలో తమ బృందం మొత్తం సంసిద్ధంగా ఉండి, ఉదయ్‌ను ఎలాగైనా కాపాడాలన్న సత్సంకల్పంతో చికిత్సలు చేసిందని రీజనల్ మెడికల్ డైరెక్టర్ వివరించారు. చికిత్స అందించిన వారిలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి రవిశేఖర్ రెడ్డి, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ పంకజ్‌తో పాటు పల్మనాలజిస్ట్ జీ అవినాష్, కార్డియాలజిస్ట్ పీ శ్యాంసుందర్ రెడ్డి, నెఫ్రాలజిస్ట్ శ్యామ్‌సుందర్ రావు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు పాటిల్ ప్రతీక్ యశ్వంత్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వెంకటేష్ పబ్బిశెట్టి ఉన్నారు.