ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jun 01, 2020 , 13:22:45

స్మార్ట్‌ఫోన్ వాడకం రోజుకు 5 గంటలు మించితే.. ప్రమాదమేనట..!

స్మార్ట్‌ఫోన్ వాడకం రోజుకు 5 గంటలు మించితే.. ప్రమాదమేనట..!

ఇది 21వ శతాబ్దం. ఈ యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఏ పని చేయాలన్నా.. దాదాపుగా మనమందరం స్మార్ట్‌ఫోన్‌నే ఉపయోగిస్తున్నాం. అయితే మనకు అనేక పనులకు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడతాయి.. నిజమే.. కానీ రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా వీటిని వాడితే మనకు ప్రమాదమేనని సైంటిస్టులు చెబుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ విభాగం విద్యార్థులు 1060 మందిపై సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో పై విషయం తేలింది. ఆ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. అలాగే వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతారనే వివరాలను కూడా రాబట్టారు. దీంతో చివరకు తేలిందేమిటంటే.. నిత్యం 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు.

స్మార్ట్‌ఫోన్ వాడకం నిత్యం 5 గంటలకు మించితే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సదరు సైంటిస్టులు పైన తెలిపిన అధ్యయనం ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థూలకాయం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని, అది మన శరీరానికి ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. కనుక నిత్యం స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వారు సూచిస్తున్నారు.


logo