ఈ ఏడాది ఢిల్లీలో ఇప్పటివరకూ దాదాపు మూడువేల దాకా ఇన్ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ పరిధిలో డెంగీ, చికున్‌గున్యా కేసులు కూడా కనిపిస్తున్నాయి. కేవలం రాజధానిలో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగానూ వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ వెల్లడించింది. అందులోనూ చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో వ్యాక్సినేషన్ తీసుకున్న పిల్లలు సురక్షితంగా బయట పడుతున్నా.. తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 65 ఏండ్లు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, 60 ఏండ్లు పైబడిన వారు, 50 ఏండ్లు దాటి గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహ బాధితులు.. అధిక ప్రమాదం ఉన్నవారిగా వైద్యులు పరిగణిస్తారు. ఈ క్రమంలో వీరంతా.. ఈ నాలుగు ముఖ్యమైన వ్యాక్సిన్లు తప్పకుండా తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్
ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వచ్చే తీవ్రమైన జ్వరం, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, శ్వాసకోశ సమస్యల నివారణకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. 60 ఏండ్లు పైబడిన వారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. అయితే, ఫ్లూ వైరస్ ఏటా తన రూపాన్ని మార్చుకుంటుంది. కాబట్టి, ఈ టీకాను సంవత్సరానికి ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది.
న్యుమోకోకల్ వ్యాక్సిన్
తీవ్రమైన న్యుమోనియా, మెనింజైటిస్, రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే స్ట్రెప్టోకోకస్ న్యుమోనియో బ్యాక్టీరియా నుంచి.. ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. 65 ఏండ్లు పైబడినవారు, ధూమపానం చేసేవారు, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఒక ప్రాథమిక డోస్, వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోస్ అవసరం అవుతుంది.
టీడాప్ వ్యాక్సిన్ (టెటానస్, డిఫ్తీరియా, పెర్టుసిస్)
ధనుర్వాతం, కంఠసర్పి, కోరింత దగ్గు అనే మూడు ప్రాణాంతక బ్యాక్టీరియల్ వ్యాధులు రాకుండా.. ఈ వ్యాక్సిన్ కాపాడుతుంది. బాల్యంలో తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా వచ్చే రోగనిరోధక శక్తి కాలక్రమేణా తగ్గుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న పెద్దలకు కోరింత దగ్గు చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి, పెద్దవాళ్లు ఒక డోస్ టీడాప్ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి పదేండ్లకు ఒకసారి టీడీ లేదా టీడాప్ బూస్టర్ తీసుకోవాలి.
కోవిడ్-19 బూస్టర్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ల వల్ల వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్, ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి, ప్రాణాపాయం నుంచి.. ఈ బూస్టర్ వ్యాక్సిన్ అదనపు రోగనిరోధక శక్తిని అందిస్తుంది. పెద్దలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన బూస్టర్లను తీసుకోవడం మంచిదని జాతీయ ఆరోగ్య మార్గదర్శకాలు చెబుతున్నాయి.
వ్యాధులు సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే.. అవి రాకముందే టీకాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం మంచిది. ఆధునిక వైద్యంలో ఇదే అత్యంత ప్రభావవంతమైన రక్షణ మార్గం కూడా. ముఖ్యంగా శ్వాసకోశ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గించడంలో ఈ నాలుగు వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా చెబుతున్నది.