Foreign Fruits | ఇటీవల కివీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడోలాంటి విదేశీ పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. ఇవన్నీ అద్భుతమైన పోషకాలను ఇస్తాయని ప్రచారం జరుగుతున్నది. ఈ మాట ఎంత వరకు నిజం? అయినా, మన దగ్గరే కాలానుగుణంగా దొరికే పండ్లు చాలా ఉన్నాయి. ఈ విదేశీ ఫలాలు భారతీయ శరీర తత్వానికి సరిపోతాయా?
– ఓ పాఠకురాలు
ప్రతి దేశానికీ తనదే అయిన పర్యావరణ వ్యవస్థ ఉంటుంది. ఆ వాతావరణానికి తగ్గట్టే పండ్లు కాస్తాయి. ఉదాహరణకు.. ఎండకాలం శరీరానికి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి, మన దగ్గర పుచ్చకాయల్లాంటివి దొరుకుతాయి. వానలు మొదలై రోగ నిరోధక శక్తి కావాల్సి వచ్చినప్పుడు దానిమ్మ, నేరేడు, జామ తదితర పండ్లు కాస్తాయి. ఆ తర్వాత దొరికే సీతాఫలాలు కూడా ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడతాయి. కాలానుగుణంగా మన ఆరోగ్యానికి ఏం అవసరమో అవే ప్రసాదిస్తుంది ప్రకృతి. వాటిని తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. వీటితో పోలిస్తే.. మనం దిగుమతి చేసుకునే విదేశీ పండ్లలో పోషకాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, విదేశాల నుంచి ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది.
ఆ వ్యవధిలో పోషకాలు తగ్గిపోతాయి. కొన్నిటిని కృత్రిమ వాతావరణంలో ఇక్కడే పండిస్తున్నారు. కొత్త నేలల్లో పూర్తి పోషకాలు రావు. అలా అని, విదేశీ ఫలాలను తినకూడదనీ చెప్పలేం. ఒకటి మాత్రం నిజం. మనం కొత్తపండ్ల మీద మోజుతో కొంటున్నామే తప్పించి.. మన పండ్లలో లేని అద్భుత గుణాలేవీ వాటిలో ఉండవు. కివీ స్థానంలో జామ పండు, లిచీ స్థానంలో అల్బుఖారా చక్కగా తినొచ్చు.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com