రోజువారీగా తీసుకునే పోషకాహారం మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే ఒక్కో సందర్భంలో కొన్ని ఆహారపదార్థాలు మంచి కంటే కీడునే కలిగిస్తాయి. ఉదాహరణకు మహిళలు నెలసరి సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి, మంట, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిలు, మహిళలు కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతుంటారు. దాన్నుంచి ఊరట పొందేందుకు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటారు. దీర్ఘకాలం ఇలా చేయడంవల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఆ సమయంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. నెలసరి నాలుగైదు రోజుల్లో ఎక్కువ మోతాదులో ఉప్పు, కాఫీలు, మసాలాలు, మాంసం, పుట్టగొడుగులు, పల్లీలు, వంకాయ, సీఫుడ్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అలాగే నొప్పి తీవ్రత తగ్గాలంటే తాజా పండ్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉండే అల్లంతో చేసిన చాయ్, పసుపు, డార్క్ చాక్లెట్, పెరుగు, కినోవా, బీన్స్ వంటివి తినాలి. వీటితో పాటు నీళ్లను ఎక్కువగా తాగుతూ ధ్యానం, వ్యాయామం, యోగా చేయడం మంచిది.