Foods For Skin Health | చర్మం అందంగా, కాంతివంతంగా ఉండాలంటే ఖరీదైన క్రీములు లేదా సుదీర్ఘమైన స్కిన్‌కేర్ రొటీన్లు అవసరమని చాలా మంది భావిస్తారు. అయితే నిపుణులు చెబుతున్నది మాత్రం వేరే విషయం. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారమే చర్మ ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతుందని వారు తెలియజేస్తున్నారు. మొటిమలు, మసకబారిన చర్మం, డార్క్ సర్కిల్స్, పొడిబారిన చర్మం వంటి సమస్యలు చాలా సందర్భాల్లో శరీరంలో పోషక లోపాలను సూచిస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కొన్ని సాధారణ పదార్థాలను చేర్చడం ద్వారా సహజంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని వారు వివరిస్తున్నారు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో వారు తెలియజేస్తున్నారు.
మసకబారిన చర్మానికి పచ్చి ఉసిరికాయ మంచి ఔషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఒక పచ్చి ఉసిరికాయ తినడం వల్ల శరీరానికి విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది చర్మానికి సహజ కాంతిని తీసుకురావడంలో సహాయపడుతుంది. అలసటగా, నిస్సత్తువగా కనిపించే చర్మానికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. మొటిమలు, బ్రేకౌట్స్ తో బాధపడే వారు స్పియర్మింట్ టీ తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ ఒక కప్పు స్పియర్మింట్ టీ తాగడం హార్మోన్ల సమతౌల్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వల్ల కాలక్రమేణా మొటిమలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే డార్క్ సర్కిల్స్ తో బాధపడే వారు నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం మంచిది. ఉదయం 5 నానబెట్టిన బాదం గింజలు తింటే విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి చర్మ కణాల పునరుద్ధరణకు సహాయపడుతూ కళ్ల కింద నలుపు తగ్గించడంలో ఉపయోగపడతాయి.
పొడిబారిన చర్మంతో బాధపడే వారు నెయ్యిని తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి చేర్చడం వల్ల చర్మానికి లోపల నుంచే తేమ అందుతుంది. ఇది పొడిబారిన, పొట్టు ఊడే చర్మానికి ఉపయోగకరంగా ఉంటుంది. మచ్చలు, పిగ్మెంటేషన్‌కు పసుపు నీరు ఔషధంగా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు కలిపి తీసుకోవడం శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల చర్మంపై మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ముందస్తు వృద్ధాప్య లక్షణాలు ఉన్న వారు నానబెట్టిన ఆక్రోట్లను తీసుకోవడం మంచిది. రోజుకు నాలుగు నానబెట్టిన ఆక్రోట్లను తీసుకోవడం ద్వారా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి చర్మం సడలిపోకుండా, ఎలాస్టిసిటీ మెరుగుపడేందుకు సహాయపడతాయి.
అసమాన చర్మ వర్ణానికి బొప్పాయి చక్కగా పని చేస్తుంది. ఉదయం అల్పాహారంలో ఒక బౌల్ బొప్పాయి తీసుకుంటే అందులోని ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ వర్ణాన్ని సమతౌల్యంలో ఉంచడంలో సహాయపడతాయి. ఆయిలీ స్కిన్, ఓపెన్ పోర్స్ ఉన్న వారు గుమ్మడికాయ గింజలను తీసుకోవాలి. రోజుకు ఒక టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలను తీసుకోవడం ద్వారా చర్మంలోని ఆయిల్ బ్యాలెన్స్ ను మెరుగుపడవచ్చు. ఇది ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అందమైన చర్మం కోసం ఎక్కువ ఖర్చు చేసే స్కిన్‌కేర్ కంటే సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ చిన్న చిన్న ఆహార మార్పులు చేయడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరచుకోవచ్చు. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించడమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.