Big Brother | హైదరాబాద్ సిటీబ్యూరో/కొండాపూర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : బిగ్ బ్రదర్స్ కన్ను పడితే ఆ ప్రాపర్టీ వారికి ఇవ్వాల్సిందే. లేదంటే ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒకదాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడుతారు. ఎక్కడా సీన్లో వారు కనిపించకపోయినా వివాదం మొదలైనప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ వారి ప్రస్తావన, వారి అనుయాయులు తప్పనిసరిగా ఉంటారు. మాదాపూర్‌లో అక్రమ కట్టడాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే నెలవారీ మామూళ్లు ముట్టడమే కాకుండా అవసరమైన చోట పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకున్న బిగ్ బ్రదర్ తాజాగా లక్కీ రెస్టారెంట్‌పై కన్నేశారంటూ స్వయంగా ఆ రెస్టారెంట్ నిర్వాహకురాలు రెహానా బహిరంగ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నది.
ముందుగా మాదాపూర్ ప్రాంతంలో రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులతో దాడులు చేయించి హోటళ్లు సీజ్ చేయించారు. అంతకుముందే బిగ్‌బ్రదర్ తన పీఏ ద్వారా అడిగితే ఆ రెస్టారెంట్‌ను ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఏకంగా దాడులు, కూల్చివేతలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే వారి రెస్టారెంట్‌ను సీజ్ చేయించి, అక్కడ కూల్చివేతలు చేపట్టి స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడిచేసి రెస్టారెంట్ లైసెన్సు రద్దు చేసిన తర్వాత దాని ముందు భాగాన్ని ప్రభుత్వ అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. రెస్టారెంట్‌ను కొన్నేండ్లుగా నడుపుతున్నామని యజమానురాలు చెప్తున్నారు. ‘మేము ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదు.. బిగ్ బ్రదర్ ఆయన పీఏ చేస్తున్న వ్యవహారంతో మేము రోడ్డున పడ్డం.. రెస్టారెంట్ ముందు భాగాన్ని కూల్చడమే కాకుండా నీళ్లు, కరెంట్ కనెక్షన్లను కూడా తీసేసిండ్రు. లైసెన్సులు రద్దు చేసిండ్రు’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
మాదాపూర్‌లో లక్కీ రెస్టారెంట్‌కు రోజూ పెద్ద ఎత్తున వినియోగదారులు వస్తుంటారు. దాన్ని సొంతం చేసుకోవడానికి బిగ్ బ్రదర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. అది అద్దె ఇల్లు కావడంతో ఆ ఇంటి యజమానిని పట్టుకొని వారి లావాదేవీలపై ప్రశ్నించారు. వారు కొన్ని సమస్యలు చెప్పడంతో వాటిని సాకుగా చూపి ఖాళీ చేయాలని చెప్పారని రెస్టారెంట్ యజమాని తెలిపారు. బిగ్ బ్రదర్ తమను ఆఫీసుకు పిలిపించారని, వారి పీఏ మాట్లాడుతూ ‘మన్సూర్భాయ్.. సమస్య సెటిల్మెంట్ చేసుకోవాలె.. ఎంతో కొంత డబ్బులిస్తం.. అక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని బెదిరించారని చెప్పారు. రెస్టారెంట్లో సుమారు నాలుగైదు కోట్ల సరుకు ఉన్నదని, ఒకేసారి ఎలా ఖాళీ చేస్తామని ప్రశ్నించడంతో రెస్టారెంట్ ముందు రూమ్‌ను బుల్డోజర్తో కూల్చేశారని రెహానా ఆరోపించారు.

మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం లక్కీ రెస్టారెంట్ భవన యజమానులు, నిర్వాహకులకు మధ్య అద్దె, స్థల వివాదం నెలకొన్నది. భవన యజమానులైన రవి, హరి మరికొందరి నుంచి రెస్టారెంట్ నిర్వాహకులు మహ్మద్ మన్సూర్, రెహానా భవన ప్రాంగణాన్ని లీజుకు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించలేదని యజమానులు చెప్తుండగా, తాము క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. కాగా గత నెల 26న లక్కీ రెస్టారెంట్లో టీజీసేఫ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆహారభద్రతాలోపాలను గుర్తించి లైసెన్సు రద్దు చేశారు. శనివారం అర్ధరాత్రి రెస్టారెంట్‌కు వచ్చే దారిని అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడాన్ని నిర్వాహకులు మన్సూర్, రెహానా పనులను అడ్డుకున్నారు. కూల్చివేతలకు పాల్పడుతున్నవారు వారిని బలవంతంగా పక్కకు నెట్టేయడంతో మాదాపూర్ రోడ్డుపై రెస్టారెంట్ ఎదుట బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ పోలీసులు రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు భవనం యజమానులపైనా కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
ఆరేండ్లుగా అద్దె చెల్లిస్తూ నడుపుతున్న లకీ రెస్టారెంట్‌ను తమకు అప్పగించాలంటూ బిగ్ బ్రదర్, ఆయన పీఏ ద్వారా ఒత్తిడి చేస్తున్నారని రెహానా ఆరోపించారు. నెలకు రూ.3.07 (7 వేలు ఆన్లైన్) లక్షల అద్దె చెల్లిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నామని, భూములు విక్రయించి హోటల్ వ్యాపారం ప్రారంభించామని ఆమె తెలిపారు. రెంట్ చెల్లించడం లేదంటూ అబద్ధాలు చెప్తూ రెస్టారెంట్‌ను లాకునేందుకు దౌర్జన్యానికి దిగుతున్నారని అవేదన వ్యక్తంచేశారు. అద్దె చెల్లిస్తున్నట్టు బ్యాంకు స్టేట్మెంట్లు, జీఎస్టీ, టీడీఎస్, తదితర అన్ని రకాల పత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులతో రెస్టారెంట్‌ను సీజ్ చేయించారని, మంచి నీరు, విద్యుత్తు, డ్రైనేజీ కనెక్షన్లను సైతం తొలగించారని వాపోయారు. రెస్టారెంట్ ముందు ఉన్న నిర్మాణాన్ని కూడా కూల్చివేయించారని చెప్పారు. వ్యాపారం కొనసాగితేనే తమ కుటుంబానికి జీవనోపాధి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో రెస్టారెంట్‌ను వదిలేయాలని ఒత్తిడి చేస్తే తమ కుటుంబ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు.