Foods For Hair Growth | ప్రస్తుతం చాలా మంది అనేక రకాల జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలిపోయేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. థైరాయిడ్, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, మందులను అధికంగా వాడడం వంటి వాటితోపాటు పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది సరైన ఆహారాలను తినడం లేదు. బయటి ఫుడ్‌ను ఎక్కువగా తింటున్నారు. దీని కారణంగా చాలా మందిలో పోషకాహార లోపం సమస్య తలెత్తుతోంది. ఇది జుట్టు రాలేందుకు కారణం అవుతోంది. అయితే రోజూ మనం తినే ఆహారాల విషయంలో పలు మార్పులు చేసుకుంటే జుట్టు రాలే సమస్యను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మనం తినే ఆహారాలే మన జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. కనుక పోషకాలు ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది.
జుట్టు రాలిపోయేందుకు ప్రధాన కారణం మన శరీరంలో తగినంత మోతాదులో మినరల్స్ లేకపోవడమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫోలేట్, ఐరన్‌తోపాటు విటమిన్లు ఎ, సి తక్కువగా ఉండడం లేదా లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. కనుక ఈ పోషకాలు మనకు లభించేలా చూసుకోవాలి. ఇందుకు గాను రోజూ పాలకూర జ్యూస్‌ను తాగాలి. పాలకూరలో అధికంగా పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు ఎ, సి, క్యాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. కనుక రోజూ పాలకూర జ్యూస్‌ను తాగుతుంటే ఫలితం ఉంటుంది. అలాగే రోజూ దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది. దాల్చిన చెక్క పొడిని మీరు తినే ఆహారాలపై చల్లి తినవచ్చు. లేదా ఈ చెక్కను నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. దీని వల్ల కేవలం జుట్టు పెరగడమే కాకుండా షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే గింజలు, విత్తనాలను రోజూ తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజలు, విత్తనాల్లో విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జుట్టును సంరక్షిస్తుంది. శిరోజాలు పెరిగేలా చేస్తుంది. అలాగే సోయాబీన్ ఉత్పత్తులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. సోయా టోఫు, సోయా పాలు, సోయా గింజలను తీసుకోవాలి. వీటిల్లో ఉండే క్యాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
రోజూ ఒక కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి బయోటిన్ అధికంగా లభిస్తుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కోడిగుడ్లలో ప్రోటీన్లు, జింక్, సెలీనియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కూడా శిరోజాలను సంరక్షిస్తాయి. అలాగే వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటున్నా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్ డి ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇలా ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే అన్ని పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారు. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.