Body Posture | శరీర భంగిమ (Posture) సరిగ్గా ఉండటం అంటే అందంగా ఉండడం కాదు, శరీర ఆరోగ్యం సరిగ్గా ఉండడం. ప్రస్తుతం ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వినియోగం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామందిలో వంగిన భంగిమ, మెడ నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని సరళమైన వ్యాయామాలను ప్రతిరోజూ చేయడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వెన్నెముక, భుజాలు, మెడ, కోర్ మసిల్స్‌ను బలపరిచే వ్యాయామాలు శరీర భంగిమను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీర భంగిమను బలపరిచే వ్యాయామాల గురించి వారు వివరిస్తున్నారు.
శరీర భంగిమను బలపరిచే వ్యాయామాల్లో చైల్డ్ పోజ్ (Child Pose) అనే యోగా ఆసనం ఒకటి. ఇది వెన్నెముక, నడుము, హిప్స్‌కు మంచి స్ట్రెచ్‌ను అందిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నుపైన ఏర్పడే ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. చేతులు, మోకాళ్లపై నిలబడి, నెమ్మదిగా నడుమును మడమల వైపు తీసుకెళ్లాలి. చేతులను ముందుకు చాపి, నుదిటిని నేలపై ఉంచి లోతుగా శ్వాస తీసుకోవాలి. 20 నుంచి 30 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండటం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. క్యాట్-కౌ స్ట్రెచ్ (Cat-Cow Stretch) వెన్నెముకకు చలనం కలిగించి గట్టిపడిన కండరాలను సడలించే వ్యాయామం. చేతులు, మోకాళ్లపై నిలబడి శ్వాస తీసుకుంటూ వెన్నును లోపలికి వంచాలి. తర్వాత శ్వాస వదులుతూ వెన్నును బయటకు గుండ్రంగా మడవాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయడం వల్ల వెన్నెముక కదలిక మెరుగుపడుతుంది. శరీర భంగిమ సరిగా ఉండేందుకు సహాయపడుతుంది.
ప్లాంక్ (Plank) వ్యాయామం కోర్ మసిల్స్, భుజాలు, నడుమును బలపరుస్తుంది. మోచేతులను నేలపై ఉంచి, శరీరాన్ని తల నుంచి కాళ్ల వరకు నిటారుగా ఉంచాలి. పొట్టను లోపలికి లాగి 20 నుంచి 60 సెకన్ల వరకు ఈ స్థితిలో ఉండాలి. ఈ వ్యాయామం శరీరానికి స్థిరత్వాన్ని ఇచ్చి ముందుకు వంగే అలవాటును తగ్గిస్తుంది. గ్లూట్ బ్రిడ్జ్ (Glute Bridge) నడుము, తొడలు, వెనుక భాగంలోని కండరాలను బలపరచడంలో ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని మోకాళ్లను మడవాలి. తర్వాత నడుమును పైకి ఎత్తి భుజాల నుంచి మోకాళ్ల వరకు ఒక సూటి రేఖలా ఉంచాలి. రెండు సెకన్ల పాటు అలాగే ఉంచి మెల్లగా కిందికి తీసుకురావాలి. రోజుకు 10 నుంచి 15 సార్లు చేయడం వల్ల నడుముకు మంచి మద్దతు లభిస్తుంది.
చిన్ టక్ (Chin Tuck) వ్యాయామం మొబైల్ లేదా కంప్యూటర్ను ఎక్కువసేపు చూడడం వల్ల వచ్చే ఫార్వర్డ్ హెడ్ పోశ్చర్‌ను సరిచేయడంలో ఉపయోగపడుతుంది. నిటారుగా కూర్చొని లేదా నిలబడి, తలను పైకి లేదా కిందికి వంచకుండా వెనక్కి లాగాలి. ఇలా చేయడం వల్ల మెడ వెనుక భాగంలో స్వల్పమైన స్ట్రెచ్ అనిపిస్తుంది. 5 నుంచి 10 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండి 10 నుంచి 15 సార్లు పునరావృతం చేయాలి. వాల్ ఏంజెల్స్ (Wall Angels) వ్యాయామం భుజాల కదలికను మెరుగుపరచి ఛాతిని తెరుచుకునేలా చేస్తుంది. గోడకు వెన్ను ఆనించి నిలబడి చేతులను W ఆకారంలో ఉంచాలి. తర్వాత మెల్లగా చేతులను పైకి తీసుకెళ్లి Y ఆకారంలోకి మార్చాలి. చేతులు, మోచేతులు గోడకు తగిలేలా చూసుకోవాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయడం వల్ల వంగిన భుజాలు సరిగా మారుతాయి.
సరైన శరీర భంగిమ ఆరోగ్యకరమైన జీవనశైలికి ముఖ్యమైన భాగం. రోజూ కొద్ది నిమిషాలు ఈ వ్యాయామాలకు కేటాయించడం ద్వారా వెన్నునొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే శరీరం చురుకుదనం పెరిగి రోజువారీ పనులు సులభంగా చేయగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.