Teeth Whitening | దంతాలు తెల్లగా మెరిసిపోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొందరికి దురదృష్టవశాత్తూ చిన్నతనం నుంచే ఫ్లోరోసిస్ సమస్య ఉంటుంది. కొందరికి మాత్రం సరిగ్గా దంతాలను తోమకపోవడం వల్ల, పలు ఇతర కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. అయితే నిత్యం పలు చిట్కాలను పాటించడం ద్వారా ఎంతటి పసుపు రంగులో ఉండే దంతాలను అయినా సరే తెల్లగా మార్చుకోవచ్చు. తెల్లగా ఉండే దంతాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు, నలుగురిలోనూ ఎలాంటి జంకు లేకుండా నవ్వేలా చేస్తాయి. దంతాలు తెల్లగా మారాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వకాలంలో మన పెద్దలు రోజూ ఆయిల్ పుల్లింగ్ చేసేవారు. ఇప్పుడు ఈ పద్ధతిని ఎవరూ పాటించడం లేదు. కానీ దంతాలు, నోరు, చిగుళ్ల ఆరోగ్యానికి ఆయిల్ పుల్లింగ్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను నోట్లో పోసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయాలి. నోట్లో అణువణువూ ఆ నూనెను తిప్పుతూ పుక్కిలించాలి. ఈ విధంగా రోజూ చేయాలి. కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్లను, క్రిములను తొలగిస్తాయి. దీంతో నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తొలగిపోతుంది. అలాగే దంతాలపై పేరుకుపోయి ఉండే పాచి, గార పోయి దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. చిగుళ్లు కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమంతో దంతాలను తోముకోవాలి. ఇది సహజసిద్ధమైన పేస్ట్‌లా పనిచేస్తుంది. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలపై ఉండే పాచి, గార పోయి దంతాలు తెల్లగా మారుతాయి. యాక్టివేటెడ్ చార్ కోల్‌ను ఉపయోగించి కూడా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఇందుకు గాను మార్కెట్లో లభించే యాక్టివేటెడ్ చార్ కోల్‌ను వాడాలి. మనం కర్రను మండించగా వచ్చే బొగ్గును వాడకూడదు. మార్కెట్లో మనకు ప్రత్యేకంగా యాక్టివేటెడ్ చార్ కోల్ లభిస్తుంది. దీన్ని పొడిలా చేసి నీటితో కలిపి పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను తోముకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే దంతాలు తెల్లగా మారుతాయి. నోరు ఆరోగ్యంగా ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.
పసుపు, ఉప్పు, ఆవనూనెలను సమాన బాగాల్లో తీసుకుని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమంతో దంతాలను తోముకోవచ్చు. ఈ మిశ్రమంలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన నుంచి విముక్తిని అందిస్తాయి. దంతాలపై ఉండే పాచి, గారను తొలగించి దంతాలు తెల్లగా మారేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించాక శుభ్రంగా నోటిని కడుక్కోవాలి. లోపలికి మింగకూడదు. అలాగే దంతాలను తెల్లగా చేయడంలో స్ట్రాబెర్రీ, బేకింగ్ సోడా మిశ్రమం కూడా బాగానే పనిచేస్తుంది. ఒక స్ట్రాబెర్రీని బాగా నలిపి పేస్ట్‌లా చేసి అందులో కాస్త బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమంతో దంతాలను తోముతూ ఉంటే కొద్ది రోజుల్లోనే దంతాలు తెల్లగా మారుతాయి. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. నోరు, చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.