Anger | కోపం అనేది మనకు కలిగే భావోద్వేగాల్లో ఒకటి. కోపం వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరికి క్షణంలోనే పట్టరానంత కోపం వస్తుంది. దీంతో తమ ఎదురుగా ఏ వస్తువు ఉంటే దాన్ని విసిరేస్తారు. ఇంకొందరు కోపం వస్తే తలను దేనికైనా బాదుకుంటారు. కొందరు పెద్ద పెద్దగా అరుస్తారు. ఇంకా కొందరు పచ్చి బూతులు మాట్లాడుతారు. ఇవన్నీ చాలా మంది కోపాన్ని వ్యక్త పరిచేందుకు చేసే పనులు. అయితే ఇలా చేయడం వల్ల కోపం మరింత పెరుగుతుందే కానీ తగ్గదు అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. కోపం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కానీ పైన చెప్పిన విధాల్లో ఏ రకంగా కోపాన్ని వ్యక్తం చేసినా అది మరింత పెరుగుతుందే కానీ తగ్గదని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే కోపాన్ని తగ్గించుకుని మైండ్‌ను రిలాక్స్ అయ్యేలా చేసుకునేందుకు వారు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే..
పట్టరానంత కోపం వచ్చినప్పుడు వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టండి. గాఢంగా శ్వాస తీసుకోండి. గాలిని బాగా లోపలికి పీల్చి బయటకు వదలండి. నెమ్మదిగా ఇలా చేయండి. దీంతో నాడీ మండల వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది. కోపం బాగా వచ్చిన వారు ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (పీఎంఆర్) అనే ఓ టెక్నిక్‌ను ఉపయోగించవచ్చు. ఇది కండరాలపై ప్రభావం చూపిస్తుంది. వెంటనే కోపం తగ్గేలా చేస్తుంది. ఇందుకు గాను శరీరంలో ఉన్న కండరాలను కదిలిస్తుండాలి. కాళ్లను పూర్తిగా పైకి లేపకుండా కేవలం పాదాలను పైకి కిందకు కదిలించవచ్చు. లేదా అరచేతులను పైకి కిందకు కదిలించవచ్చు. లేదా చేతులు, కాళ్ల, ఇతర శరీర భాగాల్లో ఉండే కండరాలను కూడా కదిలించవచ్చు. దీంతో ధ్యాస మళ్లుతుంది. కోపం తగ్గుతుంది.
ప్రతి రోజూ యోగాతోపాటు ధ్యానం చేయడం వల్ల కోపాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. యోగా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఇవి రెండూ మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. ఎంతటి కోపం వచ్చేవారు అయినా సరే రోజూ యోగా, ధ్యానం చేస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. కోపం అధికంగా ఉన్నవారికి సైకియాట్రిస్టులు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అనే చికిత్సను అందిస్తారు. ఇందులో భాగంగా మనస్సులోకి వచ్చే నెగెటివ్ ఆలోచనలను తొలగిస్తుంటారు. ఇది కోపం తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది.
తీవ్రమైన కోపం వచ్చినప్పుడు వెంటనే ఉన్న ప్రదేశం నుంచి పక్కకు వెళ్లిపోవాలి. కాసేపు పచ్చని ప్రకృతిలో గడుపుతూ చల్లని సహజసిద్ధమైన గాలిని పీల్చుకోవాలి. ఆ సమయంలో మనస్సులోకి ఎలాంటి ఆలోచనలను రానీయకూడదు. ఒక 10 నిమిషాల పాటు ఇలా చేస్తే వెంటనే కోపం తగ్గిపోతుంది. ఎంతటి తీవ్రమైన కోపం ఉన్నవారు అయినా సరే ఇలా చేస్తుంటే కచ్చితంగా కోపాన్ని నియంత్రించుకోగలుగుతారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. ఇష్టమైన ఆటలు ఆడడం, సంగీతం వినడం, పుస్తకాలను చదవడం, రోజూ పచ్చని ప్రకృతిలో కాసేపు గడపడం, కంప్యూటర్ లేదా టీవీలో గేమ్స్ ఆడడం.. వంటి పనులను చేస్తుంటే మైండ్ ఎంతగానో రిలాక్స్ అవుతుంది. దీంతో నాడీ మండల వ్యవస్థ ప్రభావితం అయి కోపం రాకుండా చూస్తుంది. ఇలా పలు చిట్కాలను పాటిస్తే ఎంతటి కోపం అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది.