Bad Breath | నోరు, దంతాలు, చిగుళ్లను అందరూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ శుభ్రతను పాటించాలి. లేదంటే నోరు దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన అన్నది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యనే. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. నోరు, దంతాలు, చిగుళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంతోపాటు చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే నోరు తరచూ పొడిబారిపోవడం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పలు రకాల మసాలా దినుసులను అధికంగా తినడం, పొగాకును నమలడం లేదా పొగ తాగడం, చిగుళ్ల వ్యాధులు ఉండడం, సైనస్, టాన్సిల్స్, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం ఉండడం, డయాబెటిస్ లేదా కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు ఉండడం వంటి అనేక కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ లేదా అర టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలిపి ఆ నీళ్లతో నోటిని పుక్కిలించాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. రోజులో కనీసం 3 నుంచి 4 సార్లు ఇలా చేస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బేకింగ్ సోడా మిశ్రమం కూడా ఇందుకు అద్భుతంగానే పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మౌత్ వాష్ గా ఉపయోగించాలి. దీంతో సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపి ఈ మిశ్రమంతోనూ నోటిని 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఇలా చేస్తున్నా కూడా నోటి దుర్వాసన నుంచి బయట పడవచ్చు.
దాల్చిన చెక్క ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలిస్తున్నా కూడా సమస్య తగ్గిపోతుంది. లవంగాలను కూడా ఇలాగే ఉపయోగించవచ్చు. లేదా నోట్లో ఒకటి రెండు లవంగాలను వేసుకుని బాగా నములుతూ చప్పరిస్తూ ఉండాలి. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగుతుండాలి. లేదా పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలి. కొత్తిమీర ఆకులు కూడా నోటి దుర్వాసనను తగ్గించేందుకు చక్కగా పనిచేస్తాయి. భోజనం చేసిన అనంతరం గుప్పెడు సోంపును నోట్లో వేసుకుని బాగా నమిలి తింటున్నా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది.
నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు నిమ్మజాతికి చెందిన పండ్లను తింటుండాలి. నారింజ, నిమ్మపండ్లు, ద్రాక్ష వంటి పండ్లను తింటుంటే సమస్య తగ్గిపోతుంది. భోజనంలో పెరుగును చేర్చుకోవాలి. ఇది నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో సమస్య తగ్గుతుంది. నోటి దుర్వాసన ఉన్నవారు రోజూ 2 సార్లు దంతాలను శుభ్రం చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాల్సి ఉంటుంది. దుర్వాసన వచ్చే ఆహారాలను తినడం మానేయాలి. వెల్లుల్లి, ఉల్లిపాయల వాడకాన్ని తగ్గించాలి. టీ, కాఫీ వంటి పానీయాలను తాగడం తగ్గించాలి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చూసుకోవాలి. ఈ చిట్కాలను పాటిస్తుంటే నోటి దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది.