Headache | ప్రస్తుతం చాలా మంది నిత్యం తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని పట్టించుకోకుండా అలాగే నిర్లక్ష్యం చేస్తే అది మైగ్రేన్‌గా కూడా మారుతోంది. తలనొప్పి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల చాలా మంది తలనొప్పి బారిన పడుతుంటారు. ఇక ఎండకాలం శరీరంలో నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీంతో తలనొప్పి వస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడితే తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పి వస్తే అందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే సహజసిద్ధంగా తలనొప్పి నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలంలో శరీరంలోని నీరు త్వరగా బయటకు పోతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది తలనొప్పిని కలగజేస్తుంది. ఒక వేళ మీకు వచ్చిన తలనొప్పి ఇలాంటిదే అయితే నీళ్లను బాగా తాగాలి. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయలు, తర్బూజా వంటి పండ్లతోపాటు కీరదోసను తినాలి. దీంతో శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. అలాగే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దీంతో తలకు రక్త ప్రసరణ మెరుగు పడి తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అల్లం టీని సేవిస్తున్నా కూడా తలనొప్పి నుంచి బయట పడవచ్చు. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి తలనొప్పిని తగ్గిస్తాయి. చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో కాస్త తేనె కలిపి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఒక కప్పు మోతాదులో అల్లం టీని సేవించాలి. దీంతో కూడా తలనొప్పి తగ్గిపోతుంది.
పెప్పర్మింట్ ఆయిల్ మనకు మార్కెట్లో లభిస్తుంది. దీని ఎసెన్షియల్ ను తెచ్చి అందులో కాస్త ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై రాయాలి. రోజుకు ఇలా 2 సార్లు చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. బాగా కాంతి ఎక్కువగా ఉండే వస్తువులను తదేకంగా చూసినా కొందరికి తలనొప్పి వస్తుంది. అంటే ఉదాహరణకు టీవీలు లేదా కంప్యూటర్లు, ఫోన్లకు బ్రైట్నెస్ను అధికంగా పెట్టి కొందరు చూస్తారు. ఇది అసలు మంచిది కాదు. కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడేలా చేస్తుంది. దీంతో తలనొప్పి వస్తుంది. కనుక డిజిటల్ తెరలను ఎల్లప్పుడూ చాలా తక్కువ బ్రైట్ నెస్లోనే వీక్షించాలి. అలాగే తలనొప్పి అధికంగా ఉన్నవారు అరటి పండ్లను తింటే మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఉండే మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు తలనొప్పిని తగ్గిస్తాయి.
రాస్స్ బెర్రీలు, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. యాప్రికాట్స్ లేదా అంజీర్ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా తలనొప్పి నుంచి బయట పడవచ్చు. అలాగే మెగ్నిషియం అధికంగా ఉండే బాదం పప్పు, జీడిపప్పు, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడి కాయ విత్తనాలు, బ్రెజిల్ నట్స్ ను తింటుండాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ కూడా ఉంటాయి. ఇవి వాపులను, నొప్పులను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. కనుక తలనొప్పి అధికంగా ఉన్నవారు మెడిసిన్లను వాడకుండా ఈ చిట్కాలను పాటిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఏం చేసినా తలనొప్పి తగ్గడం లేదు అనుకునేవారు డాక్టర్‌ను కలిస్తేనే మంచిది.