Dry Eyes | ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం కంప్యూటర్ల ఎదుట గంటల తరబడి కూర్చునే పనులనే చేస్తున్నారు. మరోవైపు టీవీలను చూడడం, ఫోన్ల వాడకం కూడా ఎక్కువైంది. దీంతో చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపు మందగిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే కళ్లద్దాలను వాడాల్సిన దుస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా నేటి తరం చిన్నారుల్లో కంటి చూపు అనేది సమస్యగా మారింది. అయితే గంటల తరబడి కంప్యూటర్లను చూడడం లేదా ఫోన్ తెరలను వీక్షించడం వల్ల చాలా మందికి కళ్లు పొడిబారిపోయే సమస్య వస్తోంది. డిజిటల్ తెరలను చూసినప్పుడు కంటి రెప్పలను ఆర్పరు. దీంతో కళ్లలో ఉండే ద్రవం త్వరగా ఆవిరైపోతుంది. ఫలితంగా కళ్లు పొడిబారిపోతాయి. ఈ దశలో పట్టించుకోకపోతే కళ్లు మరింత పొడిబారిపోయి ఎరుపెక్కుతాయి. దీంతో కళ్లు దురద పెడతాయి.
అయితే కళ్లు పొడిబారిపోవడం, దురద పెట్టడం అన్నది దీర్ఘకాలంగా ఉంటే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కానీ డాక్టర్ అందించే చికిత్సతోపాటు పలు చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ముఖ్యంగా నిత్యం కంప్యూటర్ల ఎదుట పనిచేసే వారు ఈ చిట్కాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. దీంతో సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కళ్లు పొడిబారిపోయి దురద పెట్టే సమస్య ఉంటే అందుకు వేడి నీళ్లు ఎంతో పనిచేస్తాయి. ఒక శుభ్రమైన వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి పిండేయాలి. దాన్ని మూసిన కళ్లపై 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజులో మీకు వీలు అయినప్పుడు కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి. దీంతో కళ్లు పొడిబారడం తగ్గుతుంది. కళ్లలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. కళ్లు ఎరుపెక్కవు. దురద కూడా తగ్గుతుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మేరకు 2019లో కొందరు సైంటిస్టులు అధ్యయనం చేపట్టారు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కళ్లను సంరక్షిస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎక్కువగా చేపలు, అవిసె గింజలు, వాల్ నట్స్, బాదంపప్పు, పల్లీలు వంటి వాటిల్లో లభిస్తాయి. కనుక ఈ ఆహారాలను తీసుకుంటే కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే డాక్టర్ సలహా మేరకు ఒమెగా 3 సప్లిమెంట్లను కూడా వాడవచ్చు. దీంతో కూడా సమస్య నుంచి బయట పడవచ్చు.
కలబందలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణలు ఉంటాయి. కనుక పొడిబారిపోయే కళ్లను రక్షించడంలో ఇది కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును తాజాగా సేకరించి దాన్ని కను రెప్పల మీద రాయాలి. గుజ్జు కళ్లలో పడకుండా చూసుకోవాలి. కొన్ని నిమిషాల పాటు అలా ఉన్న తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కళ్లు సురక్షితంగా ఉంటాయి. కళ్లలో మంట, ఎరుపుదనం కూడా తగ్గుతాయి. కంప్యూటర్ల ఎదుట పనిచేసే వారు 20-20-20 రూల్ను పాటించడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి. కళ్లు పొడిబారడం తగ్గుతుంది.
కళ్ల మీద కీరదోస ముక్కలను గుండ్రంగా కోసి ఉంచడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో కళ్లకు ఎంతో విశ్రాంతి, హాయి లభిస్తాయి. కళ్లు పొడిబారడం తగ్గుతుంది. కళ్లలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. కళ్ల ఎరుపుదనం, మంట తగ్గుతాయి. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.