Motion Sickness | ప్రయాణాల్లో వాంతులు అవడం (మోషన్ సిక్నెస్) అనేది సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్యే. మహిళలు, చిన్నారులతోపాటు కొందరు పురుషుల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొందరికి కారు అంటే పడదు. మరికొందరు బస్సుల్లో ప్రయాణిస్తే వాంతులు చేసుకుటారు. ఇంకా కొందరు విమాన ప్రయాణాల్లోనూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారంగా అనిపించడం, తల తిరగడం, పొట్టలో అసౌకర్యంగా ఉండడం ఇవన్నీ మోషన్ సిక్నెస్ లక్షణాలు. కొందరికి ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరికి జీవితాంతం అలాగే ఉంటుంది. ఇక కొందరికి ఒక వయస్సు వచ్చే వరకు సమస్య లేకున్నా తరువాత మొదలవుతుంది. ఇది ఎందుకు వస్తుంది, దీని వెనుక కారణాలు ఏమిటి..? అనే విషయాన్ని కూడా ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను, చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
కారులో ప్రయాణం చేసేవారు అయితే వాంతి రావొద్దంటే వీలైనంత వరకు ముందు సీట్లలో కూర్చునే ప్రయత్నం చేయాలి. వెనుక సీట్లలో అయితే కిటికీ పక్కన కూర్చోవాలి. బస్సులో కూర్చున్నా ఇదే రూల్‌ను పాటించాలి. విమానాలు, షిప్పుల్లో ప్రయాణించేవారు కూడా కిటికీల పక్కన కూర్చుంటే మంచిది. కిటికీ నుంచి బయటకు చూస్తే ఏదైనా ఒక ప్రదేశం లేదా వస్తువుపైనే ధ్యాస పెట్టాలి. దృష్టిని మాటి మాటికీ మరల్చకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత వరకు చదవడం మానేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను చూడకూడదు. ఉపయోగించకూడదు. బయటి వైపు కదులుతున్న వస్తువులు లేదా వాహనాలను, మనుషులను చూడకూడదు. కిటికీ పక్కన ఉంటే అప్పుడప్పుడు బయటి నుంచి వచ్చే తాజా గాలిని పీలుస్తుండాలి. ప్రయాణాల్లో ఉన్నవారు వాంతులు కావొద్దు అనుకుంటే విశ్రాంతి తీసుకుంటే మంచిది. కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి. లేదా నిద్రించాలి. ప్రయాణం చేయబోయేవారు వాంతులు అవకుండా ఉండేందుకు గాను ముందుగానే శరీరానికి తగినంత విశ్రాంతి లభించేలా చూసుకోవాలి.
అల్లం రసాన్ని సేవిస్తుంటే ప్రయాణాల్లో వచ్చే వాంతులు రాకుండా అడ్డుకోవచ్చు. చిన్న అల్లం ముక్కను నోట్లో ఉంచుకుని నమిలి తింటూ ఆ రసాన్ని మింగవచ్చు. దీంతో వికారం కూడా తగ్గిపోతుంది. అల్లం టీని తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. పుదీనా ఆకులతో తయారు చేసిన హెర్బల్ టీని సేవిస్తుంటే ఈ సమస్య తగ్గుతుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు వాంతికి అవకుండా ఉండేందుకు గాను శ్వాసను సుదీర్ఘంగా తీసుకోవాలి. గాలిని బలంగా పీల్చి వదులుతుండాలి. దీని వల్ల నాడీ మండల వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. వాంతికి రాకుండా అడ్డుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు నిమ్మకాయను దగ్గర పెట్టుకుని తరచూ వాసన పీలుస్తున్నా ఫలితం ఉంటుంది. లెమన్ సోడా వంటివి సేవించవచ్చు. ప్రయాణాంలో వాంతికి అవకుండా ఉండాలంటే భోజనాన్ని మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బిస్కెట్లు, అరటి పండ్లు, యాపిల్స్, హెర్బల్ టీలు వంటివి కూడా వాంతులు రాకుండా అడ్డుకుంటాయి.
ప్రయాణంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ హెవీ ఫుడ్స్‌ను తినకూడదు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలనే తినాలి. నూనె పదార్థాలు, మసాలాలు, కారం ఉండే ఆహారాలు, బేకరీ ఉత్పత్తులు, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండే ఆహారాలు, మద్యం, శీతల పానీయాలు, ఘాటైన వాసన వచ్చే ఆహారాలను తీసుకోకూడదు. ఇవన్నీ వికారం కలిగేలా చేస్తాయి. వాంతికి వచ్చేట్లు చేస్తాయి. కనుక ప్రయాణాల్లో ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలా ఆయా జాగ్రత్తలను, చిట్కాలను పాటిస్తే ప్రయాణాల్లో వాంతులు అవకుండా చూసుకోవచ్చు. వికారం కూడా తగ్గుతుంది.