గర్భధారణ… మహిళల జీవితంలో అతి మధురమైన ఘట్టం. తమకు పుట్టిన బిడ్డ పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. కానీ, కొంతమందికి దురదృష్టవశాత్తు అవయవ లోపాలు, వంశపారంపర్య వ్యాధులు తదితర సమస్యలతో కూడిన బిడ్డలు జన్మించడం జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల గురించి బాధపడే దుస్థితి తలెత్తుతుంది. ఇలా పలురకాల అనారోగ్యాలు, లోపాలను గర్భంలో ఉన్నప్పుడే గుర్తించి వారికి తగిన చికిత్స అందించాలన్నా, లేదా నయంకాని సమస్యలు, లోపాలు ఉన్న పిండాన్ని గుర్తించి దాన్ని తొలగించాలన్నా… కడుపులో బిడ్డ ఊపిరి పోసుకోకముందే పిండం ఆరోగ్యస్థితిని గుర్తించాల్సి ఉంటుంది. గర్భంలో ఉన్న పిండం పూర్తి ఆరోగ్య స్థితిని క్షుణ్ణంగా తెలుసుకుని, అవసరమైన చికిత్స అందించడాన్నే ఫీటల్ మెడిసిన్ అంటారు. ఈ ఫీటల్ మెడిసిన్ అనేది ప్రతి గర్భిణికి అవసరమా,
దీని ద్వారా ఏయే సమస్యలను గుర్తించవచ్చు, ఎలాంటి చికిత్స అందించవచ్చు, దీనివల్ల కలిగే లాభాలు మొదలైన అంశాల గురించి తెలుసుకుందాం..
Fetal Medicine | గర్భంలోనే పిండానికి చికిత్స అందించే విధానాన్ని ఫీటల్ మెడిసిన్‌గా పరిగణిస్తారు. ఇందులో భాగంగా శిశువు పిండదశలో ఉన్నప్పుడే స్క్రీనింగ్ చేస్తారు. దీంతో పుట్టబోయే శిశువుకు ఉండే సమస్యలు, భౌతిక లోపాలు, జన్యులోపాలు వంటివాటిని గుర్తించి నిర్ధారించవచ్చు. పది పదిహేనేండ్ల కింద ఈ విధమైన వెసులుబాటు లేదు. దీంతో చాలామంది తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన తరువాత చికిత్స అందించడం, కొన్ని రకాల లోపాలతో జన్మించిన శిశువుల భవిష్యత్తు గురించి బాధపడటం జరిగిపోయేవి.
కానీ, ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో పుట్టబోయే బిడ్డకు ఉన్న వ్యాధులు, లోపాలను గర్భంలో పిండదశలోనే గుర్తించవచ్చు. ఆ సమస్యలకు అవసరమైన చికిత్స కూడా పిండదశలోనే అందిస్తూ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చే విధంగా చూడవచ్చు. పైగా తలసేమియా వంటి నయం చేయలేని సమస్యలు ఉన్న పిండాలను చట్టబద్ధంగా తొలగించే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, తమ ఆరోగ్యంతోపాటు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై దృష్టిపెడుతున్న తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఫీటల్ మెడిసిన్‌కు కూడా డిమాండ్ పెరుగుతున్నది.
ఫీటల్ మెడిసిన్‌లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది అత్యంత కీలకం. ఇందులో వచ్చే ఫలితాలు స్కానింగ్ జరిపే ఆపరేటర్‌పై ఆధారపడి ఉంటాయి. అంటే స్కానింగ్‌ను సరైన పద్ధతిలో జరపాల్సి ఉంటుంది. అందుకోసం నిష్ణాతుడైన ఆపరేటర్ ఉండాలి. సాధారణంగా డయాగ్నోసిస్ అనేది సమస్యను మాత్రమే గుర్తిస్తుంది. కాని ఫీటల్ మెడిసిన్‌లో డయాగ్నోసిస్తోపాటు అవసరమైన సలహాలు, సూచనలు, కౌన్సెలింగ్, క్లినికల్ పార్ట్ వంటివి కూడా ఇమిడి ఉంటాయి. స్కానింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లో రిస్క్ గ్రూప్. రెండవది హై రిస్క్ గ్రూప్. వీరిలో కొన్ని స్కానింగ్ పరీక్షలు రెండు గ్రూపుల వారికి కూడా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎన్టీ, ఎనామలి స్కానింగ్‌లు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమవుతాయి.
లోరిస్క్ గ్రూప్ వారికి 11- 13 వారాల్లో ఎన్టీ స్కాన్, 20-22 వారాల్లో మరో ఎన్టీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. 11-13 వారాల్లో చేసే ఎన్టీ స్కాన్‌లో జెనెటికల్, క్రోమోజోమ్ లోపాలను గుర్తించవచ్చు.
రుమాటో ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్, డయాబెటిస్, ఊబకాయం, బీపీ, మేనరికం వివాహాలు, ఆలస్యంగా పెళ్లవడం, గుండె సమస్యలు, జెనెటికల్ డిజార్డర్స్ తదితర సమస్యలు ఉన్న మహిళలు రిస్క్ గ్రూప్ కిందికి వస్తారు. వీరందరికీ ప్రతి స్కానింగ్ కూడా చాలా ముఖ్యం. ఆయా స్కానింగ్స్‌లో ఫీటల్ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ రిస్క్ గ్రూప్ వారికి 7- 8 వారాల్లో వయబిలిటీ స్కాన్ కూడా అవసరం. వయబిలిటీ స్కాన్‌లో ఫీటల్ (పిండం) గుండె కొట్టుకోవడం, దాని ఎదుగుదల గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా పిండం గర్భసంచిలో ఉందా లేదా, ఫాలోపియన్ ట్యూబులో ఉందా కూడా ఈ పరీక్షతో నిర్ధారించుకోవచ్చు.
పిండం కొన్నిసార్లు ట్యూబ్‌లో ఇరుక్కుపోతుంది. దీనివల్ల పిండంలో ఎదుగుదల లేక గర్భంలోనే శిశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. పిండం గర్భసంచిలోనే ఉండాలి. అందుకే పిండం స్థానాన్ని తెలుసుకునేందుకు కూడా ఈ వయబిలిటీ స్కాన్ చాలా ఉపయోగపడుతుంది. రిస్క్ గ్రూప్ కిందికి వచ్చే మేనరికం వివాహాలు చేసుకున్న వారు గర్భం దాల్చే ముందు పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
పిండం 11-13 వారాల వయసప్పుడు చేసే స్కాన్‌ను న్యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ లేదా ఎన్టీ స్కాన్ అంటారు. ఇందులో పిండం మెడ వెనకాల చర్మం కింద ఉండే ఫ్లూయిడ్స్ మందాన్ని తెలుసుకోవచ్చు. సాధారణ శిశువులో మెడ వెనకాల ఉన్న చర్మం కింద ఫ్లూయిడ్ 2.3 నుంచి 2.4 మిల్లీమీటర్లు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే చర్మంపై వాపు వస్తుంది. ఈ వాపు గుండె సమస్య లేదా క్రోమోజోమ్ లోపం, జెనెటిక్ లోపం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ స్కాన్ ఆధారంగా శిశువులో క్రోమోజోమ్, జన్యులోపం, గుండె సమస్యలను గర్భంలో ఉన్నప్పుడే గుర్తిస్తారు. ఈ పరీక్ష ప్రతి ఒక్కరికీ అవసరం. అదే సమయంలో డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. ఇది క్రోమోజోముల లోపాల్ని 90 శాతం కచ్చితంగా గుర్తిస్తుంది. 70 శాతం వరకు స్ట్రక్చరల్ లోపాలు… అంటేపుట్టబోయే శిశువు భౌతిక లోపాలను సైతం గుర్తించవచ్చు.
టిఫా స్కానింగ్ 20- 22 వారాలప్పుడు చేస్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైన స్కానింగ్. ఇందులో పిండం తల నుంచి కాలు వరకు ప్రతి అవయవాన్నీ పరీక్షిస్తారు. మెదడు, తల, ముఖం, మెడ, వేళ్లు, వెన్నెముక, గుండె, ఊపిరితిత్తులు, కాళ్లు , చేతులు, మాయ, నీరు, కదలికలు, గర్భశాయ ముఖద్వారం కూడా చూడవచ్చు. అంతేకాకుండా ఈ స్కానింగ్‌లో సర్వైకల్ లెంగ్త్ కూడా తెలుసుకోవచ్చు. టిఫా, ఎన్టీ స్కాన్లు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు.
ఫీటల్ ఇకో కార్డియోగ్రఫి
ఫీటల్ ఇకో కార్డియోగ్రఫీ స్కానింగ్‌ను 22- 24 వారాల్లో జరుపుతారు. ఇందులో భాగంగా గర్భసంచిలో ఉన్న శిశువుకు గుండె పరీక్ష చేస్తారన్నమాట. ఇది తల్లిదండ్రుల ఆరోగ్య నేపథ్యం ఆధారంగా 16- 17 వారాల్లో కూడా ఈ ఫీటల్ ఇకో కార్డియోగ్రఫీ చేస్తారు. కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలున్నా, తల్లి ఆటోఇమ్యూన్ రోగి అయినా, 11- 13 స్కాన్‌లో వాపు ఉన్నప్పుడు ఈ ఫీటల్ ఇకో కార్డియోగ్రఫీ అవసరం ఉంటుంది. కవలలు ఉన్నా కూడా ఈ పరీక్షకు వెళ్లాలి. ఈ పరీక్షలో గుండె పనితీరు, రక్తం గుండెలోపలికి, వెలుపలికి ప్రవహించడం (ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో), రక్త ప్రసరణలో ఏదైనా లీకేజ్, పంపింగ్ సామర్థ్యం వంటివి సవ్యంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. భారతీయ చట్టాల ప్రకారం 24 వారాల్లోపు మాత్రమే అబార్షన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి, ఆలోపు మాత్రమే ఈ పరీక్షలన్నీ చేయాలి.
నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్‌ను 10 వారాల తర్వాత చేయవచ్చు. ఈ పరీక్ష ద్వారా పిండంలో డౌన్ సిండ్రోమ్‌ను 99 శాతం గుర్తించవచ్చు. ఒకవేళ డౌన్ సిండ్రోమ్ ఉన్నట్టు తేలితే అప్పుడు సమస్యను 100 శాతం కచ్చితంగా నిర్ధారించేందుకు ఇన్వేజివ్ టెస్ట్ అవసర పడుతుంది. ఎన్ఐపీటీలో భాగంగా తల్లి రక్తం తీసుకుని అందులోంచి పిండం డీఎన్ఏను వేరుచేస్తారు. ఆ తర్వాత 5 క్రోమోజోమ్‌ల పనితీరు అంటే… 21వ క్రోమోజోమ్, 18, 13వ క్రోమోజోమ్, ఎక్స్, వై కోమోజోమ్ల పనితీరుతోపాటు డౌన్ సిండ్రోమ్‌ను గుర్తిస్తారు. డౌన్ సిండ్రోమ్ మానసిక రుగ్మతలైన బుద్ధిమాంద్యం, మెదడులో ఎదుగుదల లేకపోవడం వంటి లోపాల కిందికి వస్తుంది. అయితే ఈ పరీక్షలో సమస్యను 99 శాతం వరకు మాత్రమే గుర్తించే వీలు ఉంటుంది.
ఎన్ఐపీటీలో ఏదైనా సమస్యను గుర్తించినప్పుడు ఇన్వేజివ్ టెస్ట్ చేయాలి. దీనిద్వారా సమస్యను 100 శాతం కచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ పరీక్షలో భాగంగా సూది సాయంతో మాయలోని ‘విలై’ని తీసి ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఇన్వేజివ్ టెస్ట్ రెండు రకాలు. ఒకటి కొరియోనిక్ విల్లోస్ సాంప్లింగ్. ఇది 11-14 వారాల్లో చేస్తారు. రెండోదైన ఆమ్నియోసెంటెసిస్ టెస్ట్‌ను 16 నుంచి 20 వారాల్లో చేస్తారు. ఈ పరీక్షల ద్వారా పిండం గుండెలో ఉన్న లోపాలు, రంధ్రం వంటి సమస్యలే కాకుండా భౌతిక పరమైన ఆకృతి లోపాలు, తలసేమియా వంటి రక్త సంబంధిత లోపాలనూ గుర్తించవచ్చు. అంతేకాకుండా జెనెటిక్ లేదా స్ట్రక్చరల్ లోపాలను కూడా నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ద్వారా గర్భం ఉంచాలా లేక తొలగించాలా అనేది నిర్ణయిస్తారు. పై స్కానింగ్, టెస్టులన్నీ 24 వారాల్లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముగ్గురు లేదా నలుగురు శిశువులు ఉన్నవారిని ట్విన్స్‌కు (ఇద్దరికి) కన్వర్ట్ చేస్తారు. దీనినే ఫీటల్ రిడక్షన్ అంటారు. గర్భం ధరించిన 11- 13 వారాల్లో అంటే ఎన్టీ స్కాన్ సమయంలోనే ఫీటల్ రిడక్షన్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటికల్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్‌కి కచ్చితంగా ఫీటల్ మెడిసన్ అవసరం. లేజర్ సర్జరీతో మాయను వేరుచేస్తారు. దీనిని లేజర్ థెరపీ అంటారు. ప్రతి 2 వారాలకు స్కానింగ్ అవసరం.
సాధారణంగా తల్లిది నెగెటివ్ బ్లడ్‌గ్రూప్ ఉన్నప్పుడు శిశువు పాజిటివ్ ఉంటే అప్పుడు శిశువు ప్రాణాలకే ప్రమాదకరం. ఇలాంటి శిశువుకు ఇంట్రాయూటరైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయవచ్చు. అంటే గర్భంలో ఉన్నప్పుడే పిండానికి రక్తం ఎక్కించవచ్చన్నమాట. ఇది 95 శాతం వరకు ఫలితాలను ఇస్తుంది.
గ్రోత్, డాప్లర్ టెస్టులను 7 నెలల సమయంలో చేయాల్సి ఉంటుంది. గర్భంలో శిశువు ఎదుగుదల, మాయ పెరగకపోవడం, రక్త ప్రసరణ లోపాలు వంటివి గుర్తిస్తే వెంటనే ప్రసవం చేయాలి. ప్రస్తుతం గర్భంలో ఉన్న పిండానికి చికిత్స అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో గర్భంలో ఉన్న పిండానికి ఫీటల్ సర్జరీ కూడా సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ పరిజ్ఞానం విదేశాలో ఆచరణలో ఉంది. త్వరలోనే భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ గౌరి వినాయక్ ధమంగౌకర్
ఎంబీబీఎస్, ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజి
ఫెల్లో ఇన్ ఫీటల్ మెడిసిన్-మెడిస్కాన్(చెన్నై)
ఫీటల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్
రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్