Fertility Foods | మారిన మన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం మన ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల్లో సంతానలేమి కూడా ఒకటి. మారిన జీవన అలవాట్లు, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల పురుషుల్లో, స్త్రీలల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సరిగ్గా రాకపోవడం, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉండడం వంటి సమస్యలతో నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. ఇలా సంతానలేమితో బాధపడే వారు మందులను వాడడంతోపాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. సంతానోత్పత్తికి కావల్సిన పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందాలంటే మొదటి అడుగు మన వంటగది నుండే ప్రారంభించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సంతానోత్పత్తిని ప్రోత్సహించే కొన్ని ఆహారాల గురించి వారు తెలియజేస్తున్నారు. వాల్నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషులు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి డీఎన్ఏ ను రక్షించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా అధిక ప్రాగ్మెంటేషన్ ఉన్న పురుషుల్లో డీఎన్ఏ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల స్త్రీలల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. తద్వారా వారిలో నెలసరి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా అవిసె గింజలను తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలు కూడా సమతుల్యంగా ఉంటాయి.
దుంపల్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి పునరుత్పత్తి అవయవాలకు రక్తాన్ని, ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో సహాయపడతాయి. దీంతో పునరుత్పత్తి అవయవాల పనితీరు పెరిగి సమస్యలు తగ్గుతాయి. కేఫీర్ ఒక పులియబెట్టిన పానీయం. పొట్ట ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈస్ట్రోజన్ డిటాక్స్ తో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహించేలా చేయడంలో కూడా ఈ పానీయం సహాయపడుతుంది. చిలగడదుంపల్లో బీటా కెరోటీన్ తో పాటు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ప్రొజెస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో చిలగడదుంపలు ఎంతగానో సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల స్త్రీలల్లో అండం విడుదల సరిగ్గా ఉంటుంది. అండం నాణ్యత పెరుగుతుంది. ఇక పురుషులు వీటిని తీసుకోవడం వల్ల వారిలో టెస్టోస్టెరాన్ స్ఠాయిలు మెరుగుపడుతాయి.
పాలకూరలో ఫోలేట్ అధికంగా ఉంటుంది. పాలకూరను తీసుకోవడం వల్ల సంతానలేమితో బాధపడే స్త్రీలకు ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవడం వల్ల పిండం నాడీ వ్యవస్థ అభివృద్ది చెందుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో, పురుషుల్లో పునురుత్పత్తి అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రెజిల్ నట్స్ ను తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో సెలీనియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, వాటి నాణ్యత పెరుగుతుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల స్త్రీలకు, పురుషులకు ఇద్దరికీ మేలు కలుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత తగ్గడం, వీర్య కణాల సంఖ్య పెరగడంతో పాటు భవిష్యత్తులో పిండం అభివృద్ధికి కూడా ఈ ఆహారాలు తోడ్పడతాయి. దీని వల్ల సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.