Fenugreek Seeds For Beauty | మన వంట గదిలో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. వంటల్లో వీటిని రుచి కోసం వాడుతూ ఉంటాం. మెంతులు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధిని తగ్గించడంలో, జుట్టు పెరుగుదలకు, బాలింతలల్లో పాలు బాగా రావడానికి ఇలా అనేక రకాలుగా మెంతులు మనకు సహాయపడతాయి. ఇవి మాత్రమే కాకుండా మన చర్మ సంరక్షణలో, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా మెంతులు మనకు దోహదపడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మెంతుల వల్ల మన చర్మానికి అనేక లాభాలు కలుగుతాయి. అయితే చర్మ సంరక్షణకు, సౌందర్యానికి మెంతులను ఎలా ఉపయోగించాలి.. అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ వివరాలను ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు.
మెంతులు ఒక స్క్రబ్ లాగా పనిచేస్తాయని చెప్పవచ్చు. మెంతులను వాడడం వల్ల చర్మ రంధ్రాలు లోతుగా శుభ్రపడతాయి. ఇవి ఎక్స్ ఫోలియేటర్ గా పని చేస్తాయి. దీని కోసం మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ లాగా చేసి ముఖానికి రాసుకోవాలి. తరువాత సున్నితంగా మర్దనా చేసి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా కనపడుతుంది. అలాగే మెంతుల వల్ల అకాల వృద్ధాప్యం నివారించబడుతుంది. ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మెంతులను వాడడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మెంతుల్లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజల పేస్ట్ లో 3 చుక్కల నిమ్మరసం, 5 చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి. ముఖ చర్మం బిగుతుగా తయారవుతుంది.
చర్మం రంగు మారడం, పిగ్మెంటేషన్ వంటి సమస్యలతో బాధపడే వారికి మెంతులు చక్కగా పని చేస్తాయి. మెంతుల్లో ఉండే విటమిన్ కె పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రంగా నానబెట్టిన మెంతులను పేస్ట్ గాచేసి ముఖానికి రాసుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది.
పొడిచర్మం కారణంగా ముఖం అందాన్ని కోల్పోతుందనే చెప్పవచ్చు. నిర్జీవంగా మారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చడంలో మెంతులు మనకు దోహదపడతాయి. పొడిచర్మం సమస్యతో బాధపడే వారు 2 టేబుల్ స్పూన్ల మెంతి పేస్ట్ కి 1 టేబుల్ స్పూన్ పెరుగు, అర టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం తగ్గడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది. ఇలా చర్మ సౌందర్యానికి మెంతులను ఉపయోగించవచ్చు.